ఏపీలో కొత్త కొత్త రాజకీయ అంశాలు తెరపైకి వస్తున్నాయి. మెగా అన్నయ్య చిరంజీవి మరోసారి పెద్దల సభకు  వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.  రాష్ట్రపతి కోటాలో రాజ్యసభలో పన్నెండు మంది సభ్యులు ఉంటారు. దేశంలోని వివిధ రంగాల్లో సుప్రసిద్దులైన వారిని ఎంపిక చేసి వారికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తూంటారు.

ఇప్పటికే టాలీవుడ్ నుంచి విజయేంద్ర ప్రసాద్ ఈ కోటాలో  రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రంజన్ గొగోయ్, సుధామూర్తి వంటి వారు కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ కోటాలో రాజ్యసభ సభ్యుడు అవ్వాలంటే ఆయా రంగంలో సుప్రసిద్ధులు అయితే చాలు. . సినీ రంగంలో చిరంజీవి ఎప్పుడో దిగ్గజంగా మారారు. సో.. చిరంజీవి రాజ్యసభకు నామినేట్ కావడానికి ఏ పార్టీలోనూ చేరాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ సభ్యత్వమూ తీసుకోవాల్సిన అవసరం లేదు. 

రాష్ట్రపతి నామినేట్ చేయాల్సిన రాజ్యసభ స్థానాలు ప్రస్తుతం నాలుగు ఖాళీ ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ నాలుగింటిలో ఒకటి చిరంజీవికి ఖరారు చేశారన్న సమాచారం రాష్ట్ర రాజకీయవర్గాలకు చేరినట్లు సమాచారం. రాజ్యసభ రేసులో నాగబాబు పేరు ముందు వినిపించినా ... ఇద్దరినీ రాజ్యసభకు పంపడం సముచితం కాదన్న ఉద్దేశంతో నాగబాబును రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంచారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఇప్పటికే ఈ అంశంపై చర్చించారని మొత్తం ఫైనల్ అయిందని .. ఇక అధికారిక ప్రకటనే మిగిలి ఉందని భావిస్తున్నారు. రాజ్యసభకు మెగాస్టార్ నామినేట్ అయితే.. ఇక మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఈ నియామకం ఎప్పుడు జరుగుతుందని వారు ఎదురుచూస్తున్నారు.

Related Videos