ఏపీ రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు అయింది. ఈ రుణం గురించి కేంద్ర బడ్జెట్ వేళ ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేసారు. ఆ తరువాత ప్రపంచ బ్యాంకు రుణం రీ పేమెంట్ పైన చర్చ జరిగిన క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమరావతి రుణం పైన తాజాగా ప్రపంచ బ్యాంకు సీఆర్డీఏకు లేఖ రాస్తూ... తాము ఇస్తున్న రుణం వివరాలను వెల్లడించింది. దీంతో పాటుగా ఈ రుణం చెల్లించాల్సిన గడువు పైన స్పష్టత ఇచ్చింది. అమరావతి ఇంటిగ్రేటెడ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రామ్‌ కింద 800 అమెరికన్‌ మిలియన్‌ డాలర్ల రుణాన్ని ప్రపంచబ్యాంకు మంజూరు చేసింది. ఈ రుణం మంజూరు వేళ అనేక కండీషన్లను ప్రపంచ బ్యాంకు ప్రస్తావించింది. ఆరు విడతల్లో రుణం విడుదల చేసేలా తమ నిర్ణయం వెల్లడించింది. ఎప్పటికప్పుడు పనుల పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. ప్రణాళికలో పేర్కొన్న విధంగా పనులు పూర్తి చేస్తే తదుపరి విడత నిధులు మంజూరు చేయనుంది.

అమరావతి పనులను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తారు. తాము ఇస్తున్న రుణాన్ని ఆరు సంవత్సరాల గ్రేస్‌ పీరియడ్‌తో 29 ఏళ్లలో చెల్లించాలని ప్రపంచబ్యాంకు లేఖలో స్పష్టం చేసింది. సీఆర్‌డీఏకు ప్రపంచబ్యాంకు రుణం మంజూరు.. షరతులు, రీ పేమెంట్  షెడ్యూల్ ను వివరిస్తూ లేఖ రాసింది. అమరావతికి ప్రపంచ బ్యాంకు ఇచ్చే రుణం ఎవరు చెల్లించాలి.. ఎంత కాలంలో తిరిగి చెల్లింపులు చేయాలనే దాని పైన కొంత కాలంగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు తాజా లేఖతో దీనిపై స్పష్టత వచ్చింది. సంస్థాగత అభివృద్ధి కోసం ప్రపంచబ్యాంకు ఈ రుణం ఇస్తున్నట్లు పేర్కొంది.

అమరావతిలో మౌళిక సదుపాయాల కల్పన..సంస్థల ఏర్పాటు..ఉద్యోగాలు, ఉపాధి కల్పనను పెంచేందుకు సీఆర్‌డీఏ ఇచ్చిన సూచనలను బ్యాంకు డైరెక్టర్లు ఆమోదించినట్లు లేఖలో వివరించారు. ఇందుకోసం ప్రైవేటు రంగాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడం ద్వారా సకాలంలో ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించాలని స్పష్టం చేసారు. దీనిపై వచ్చే గ్రీవెన్స్‌ను తనిఖీ చేస్తూ ఉంటామని పేర్కొన్నారు. ఐదేళ్లలో రాజధానికి రూపురేఖలు తీసుకువస్తే ప్రైవేటు కంపెనీలు, సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉపాధి పెరుగుతుందని ప్రభుత్వం చర్చల్లో భాగంగా ప్రపంచ బ్యాంకుకు వివరించింది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. దీంతో, ఇప్పుడు ఈ లేఖ ద్వారా ప్రపంచ బ్యాంకు రుణం తిరిగి చెల్లింపు పైన దాదాపు స్పష్టత వచ్చింది.

Related Videos