ఎన్నికల ఫలితాలు మరో ఐదు రోజుల్లో వెలువడనున్న క్రమంలో ఏపీలో అన్ని ప్రధాన పార్టీలు మైండ్ గేమ్ స్టార్ట్ స్టార్ట్ చేశాయి. గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి వైసీపీ, టీడీపీ సిద్దంగా లేవు. పోస్టల్ బ్యాలట్ల చెల్లుబాటుపై ఇటీవల ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలను సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించడానికి శ్రీకారం చుట్టింది. దేశమంతటా ఒక రూల్ ఉంటే ఇక్కడ మాత్రమే మార్చడమేంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పోస్టల్ బ్యాలట్లపై గెజిటెడ్ ఆఫీసర్ డిక్లరేషన్‌తో సంతకం లేకున్నా చెల్లుబాటు అవుతుందనే అంశంపై వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అక్కడ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వైసిపి న్యాయ పోరాటం చేస్తోంది.
ఇదిలా ఉండగా ఫలితాలు వెల్లడయ్యే వరకూ ఏ పార్టీ కూడా ఓటమిని అంగీకరించదు. తామే గెలుస్తామని ఢంకాబజాయించి మరీ చెప్పడం సాధారణమే. పరాజయాన్ని ముందుగానే ఒప్పుకుంటే పార్టీ శ్రేణులు చెల్లాచెదురైపోతాయనే భయమే ఇందుకు కారణం. కాగా, వైసీపీ అధినేత జగన్ సొంత సంస్థల ద్వారా సర్వే చేయించుకొని గెలుపు మీద ధీమా వ్యక్తం చేశారు. దీంతో ఆ పార్టీ నేతలు విశాఖపట్నం ఆంధ్రా విశ్వ విద్యాలయంలో 9న ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు సిద్దమవుతున్నారు. పార్టీ విజయంపై ఎలాంటి అనుమానాలు లేవని.. పోలింగ్ వన్‌సైడ్ జరిగిందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. క్యాడర్ భారీ ఎత్తున విశాఖ తరలి రావాలని కోరుతున్నారు. సీఎంగా జగన్ రెండోసారి చేసే ప్రమాణస్వీకారం నభూతో.. నభవిష్యత్తు అన్నట్లు నిర్వహించాలని ఆ పార్టీ నేతలు ఏర్పాట్లకు కసరత్తు చేస్తున్నారు. ఇంకోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా నుంచి బుధవారం హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం పవన్‌తోపాటు కూటమి నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. కూటమి పార్టీల్లో ఈపాటికే గెలుస్తున్నామనే ధీమా వచ్చేసింది. అంతటి భారీ పోలింగ్ నమోదయిందంటే.. అది ప్రభుత్వ వ్యతిరేకత వల్లేనని కూటమి నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి సమాచారం తెప్పించుకున్నారు. మొత్తం లెక్కలేసి కూటమి విజయం తథ్యమంటున్నారు. చంద్రబాబుతో జరిగే సమావేశంలో మంత్రి పదవుల గురించి చర్చించవచ్చని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. ఇలా ఇరుపార్టీలూ విజయంపై ధీమా వ్యక్తం చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి స్పందిస్తూ... వైసీపీ లేదా కూటమి గెలిచినా 95 నుంచి 97 స్థానాలు రావొచ్చని అన్నారు. దీన్నిబట్టి విజయం రెండు పక్షాల్లోనూ దోబూచులాడుతున్నట్లు గా అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos