నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రైల్వేకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత రైల్వేల అభివృద్ధి జోరు మరింత పెరిగింది. తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు విలాసవంతమైన ప్రయాణాన్ని అందించాలనేది కేంద్ర ప్రభుత్వ దృక్పథంగా ఉంది. దీంతో వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టారు. అలాగే ప్రస్తుతం అహ్మదాబాద్-ముంబయి మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది చివరకు ఇది ప్రారంభం కాబోతోంది.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా బుల్లెట్ రైలు ప్రాజెక్టు దక్కబోతోంది. అమరావతి, విజయవాడ, చెన్నై, బెంగళూరు నగరాలను కలిపేలా బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయనేది ముఖ్యమంత్రి చంద్రబాబు భావనగా ఉంది. ఇదే విషయాన్ని ఆయన ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ తో పంచుకున్నారు. దీనిపై ఆయన కచ్చితంగా ఆలోచిస్తామని హామీ ఇచ్చారని, అనుకున్నట్లుగా అన్నీ ఒక కొలిక్కి వస్తే 2027లో పనులు ప్రారంభం కానున్నాయని చంద్రబాబునాయుడు వెల్లడించారు.

వీటితోపాటు నడికుడి-శ్రీకాళహస్తి, కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్లకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వాలని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. అలాగే కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసి విశాఖ ఉక్కు గురించి చర్చించామని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరినట్లు చెప్పారు. వాస్తవానికి ఏపీలో బుల్లెట్ రైలు ప్రతిపాదన ఇప్పటికే ఉంది. చెన్నై - మైసూరు 435 కిలోమీటర్ల హైస్పీడ్ కారిడార్ లో భాగంగా బుల్లెట్ రైలు నడపాలని 2019లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

దీనికి ఉండే హాల్టింగ్స్ లో ఏపీలోని చిత్తూరు కూడా ఉంది. అయితే తాను ప్రతిపాదించిన బుల్లెట్ రైలు కారిడార్ అమరావతిని ప్రధాన నగరాలకు అనుసంధానం చేస్తుందని, దీనివల్ల సంపద సృష్టి జరుగుతుందనేది చంద్రబాబు అభిప్రాయంగా ఉంది. అతి త్వరలోనే ఇది కార్యరూపం దాల్చే అవకాశం కనపడుతోంది. తెలుగుదేశం పార్టీపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆధారపడుతుండటంతో ఆ పార్టీ కోరిన కోరికలన్నీ నెరవేర్చడానికి నరేంద్రమోడీ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

Related Videos