ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల వేళ చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారింది. శుక్రవారం అంటే రేపు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఏపీకి కేంద్ర ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలోని తాజా పరిణామాల పైన చంద్రబాబు చర్చించనున్నారు. ఇదే సమయంలో ప్రధానిని ఏపీలో పలు ప్రాజెక్టుల శంకుస్థాపనకు చంద్రబాబు ఆహ్వానించనున్నారు.
కేంద్రం నుంచి రానున్న కొత్త ప్రాజెక్టుల అంశం పైన ప్రధానితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పోలవరం, అమరావతికి కేంద్రం తాజాగా నిధులు కేటాయించింది. అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రూ 15 వేల కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ రుణం కేంద్ర గ్రాంటుగా ఇస్తుందని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. 30 ఏళ్ల కాల పరిమితి తో రుణం ఖరారైంది. ఇప్పటికే సీఆర్డీఏ అధికారులు ఈ మేరకు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నారు.
ఇక, చంద్రబాబు ఈ సమావేశంలో వచ్చే నెలలో అమరావతిలో కొత్త రైల్వే లైన్ కోసం భూమి పూజ చేయాలని నిర్ణయించారు. దీంతో పాటుగా విశాఖ రైల్వే జోన్ కు సైతం ఒకే సమయంలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారానే అమరావతి పనులు ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నారు. దీంతో, ఇప్పుడు చంద్రబాబు ఈ పర్యటనలో ... ప్రధానిని ఏపీకి ఈ కార్యక్రమాలకు రావాల్సిందిగా ఆహ్వానించనున్నారు. ఇక.. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ తోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఆర్దిక అంశాల పైన చర్చించనున్నారు.
మరోవైపు చంద్రబాబు మహారాష్ట్రలో ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. ప్రధానితో భేటీ సమయంలో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అంశం పైన చర్చించ నున్నారు. ఏపీ నుంచి ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు, పవన్ ను మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని బీజేపీ నాయకత్వం కోరింది. పవన్ ప్రచారానికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబు ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos