ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలు మతం రంగును పులుముకొన్నాయి. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, చేపనూనె వాడుతున్నారనే వివాదానికి పుల్‌స్టాప్ పడక ముందే.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ వివాదం తెర మీదికొచ్చింది. ఈ వ్యవహారాల మీదే తప్ప పాలనా పరమైన అంశాలేవీ చర్చకు రావట్లేదు చాలా రోజులుగా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అమలు చేస్తానన్న సూపర్ 6 గ్యారంటీలు సహా ఇంకేదీ వార్తల్లో ఉండట్లేదు.
రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజల నుంచి సలహాలు, సూచనలను కోరుతున్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ పురోగమింపజేయడానికి అవసరమైన సలహాలు, సూచనలు, ఆలోచనలను తమతో పంచుకోవచ్చని విజ్ఞప్తి చేశారు.
దీనికి అవసరమైన లింక్‌ను ఆయన తన అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా ఫేర్ చేశారు. https://swarnandhra.ap.gov.in/ అనే వెబ్‌సైట్ ద్వారా ఎవరైనా గానీ తమ సూచనలను ప్రభుత్వ పెద్దలకు తెలియజేయవచ్చు. అలాంటి వారికి ఏపీ ప్రభుత్వం నుంచి ఇ-ప్రశంసపత్రం అందుతుంది. 2047 నాటికి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిని 2.4 ట్రిలియన్లు, తలసరి ఆదాయాన్ని 43,000 డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో తాము అహర్నిశలు కృషి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించి తీరాలనే పట్టుదలతో ఉన్నామని అన్నారు.
దీన్ని అందుకోవడానికి అవసరమైన తమ విలువైన సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, ఆలోచనలను తెలియజేయాలని చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరి గళాన్నీ తాము వింటామని, ప్రతి సలహాలను కూడా అత్యంత విలువైనదిగా భావిస్తామని ఆయన పేర్కొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos