దేశంలో ఎలాంటి విపత్తు సంభవించినా.. లేదా ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే.. మెగాస్టార్ చిరంజీవి తన మానవత్వాన్ని ప్రదర్శిస్తారనే విషయం పలు సందర్భాల్లో స్పష్టమైన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు, భారీ తుఫాను, వరదల తాకిడికి ప్రజా జీవనం స్తంభించింది. వరద ప్రాంతాల్లో జనం ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను చూసి చలించిన చిరంజీవి భారీ విరాళాన్ని ప్రకటించారు.
గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేయడంతో చిరంజీవి వెంటనే స్పందించారు. తన అభిమానులకు సందేశాన్ని ఇస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే... అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను అని సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను.ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని చిరంజీవి ఓ ప్రకటనలో తెలిపారు.
ఇటీవల కేరళలోని వాయనాడ్ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తినప్పుడు కూడా భారీ విరాళాన్ని ప్రకటించారు. కేరళవాసులకు అండగా నిలిచారు. స్వయంగా కేరళ సీఎంను కలిసి తన విరాళానికి సంబంధించిన చెక్‌ను కూడా అందజేసి వారికి మనోధైర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos