ఏపీలో ప్రస్తుతం డిప్యూటీ సీఎం, సీఎం పదవులపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతల నుంచి మొదట డిమాండ్లు రావడంతో పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయాలంటూ జనసేన శ్రేణులు కూడా డిమాండ్లు మొదలెట్టాయి. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతున్న సమయంలో.. టీడీపీ అధిష్టానం వీటికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.
నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి గురించి ఎవరూ మాట్లాడవద్దని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్ద వద్దని.. కూటమి ప్రభుత్వంలో తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా పార్టీల అధినేతలు అందరూ కలిసి చర్చించుకున్న తర్వాతే తీసుకుంటారని స్పష్టం చేసింది. మొత్తంగా నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం డిమాండ్ పై అత్యుత్సాహం వద్దని టీడీపీ నేతలకు అధిష్టానం ఓ రకంగా గట్టిగానే చెప్పింది. ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి నేతలకు ఈ మేరకు ఆదేశాలు వెళ్ళాయి. మరోవైపు టీడీపీ అధిష్టానం ఆదేశాల తర్వాత కూడా మంత్రి టీజీ భరత్ హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దావోస్ పర్యటనకు వెళ్లిన టీజీ భరత్‌కు.. పార్టీ అధిష్టానం నిర్ణయంపై సమాచారం ఉందో లేదో తెలియదు కానీ.. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఉన్న వేదికపై నుంచే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరికి ఇష్టం ఉన్నా, లేకున్నా నారా లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై చంద్రబాబు... టీజీ భరత్‌ను సున్నితంగా మందలించారు.
ఇదే సమయంలో జనసేన పార్టీ కూడా డిప్యూటీ సీఎం అంశంపై స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించవద్దంటూ మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. మీడియాతో పాటుగా సోషల్ మీడియాలోనూ డిప్యూటీ సీఎం అంశంపై మాట్లాడవద్దంటూ జనసైనికులకు అధిష్టానం స్పష్టం చేసింది.
టీడీపీ అధిష్టానం స్పందించిన నేపథ్యంలోనే జనసేన కూడా తమ నేతలు, కార్యకర్తలు ఎవరూ డిప్యూటీ సీఎం అంశంపై మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారానికి ఇకనైనా ఫుల్ స్టాప్ పడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos