అమరావతి: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ఈ ఏడాది జరగనున్న దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. అక్టోబర్ 3 నుంచి 12 వరకు జరిగే ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి  ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ సృజన, పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉత్సవాల నిర్వహణ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తవుతున్నాయని సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం కోసం ఏర్పాట్లను ముమ్మరం చేసామన్నారు. వివిఐపీల దర్శనం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు వృద్ధులు, దివ్యాంగుల కొరకు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు దర్శన ఏర్పాట్లను చేసామన్నారు. విఐపి ల  దర్శనం జరిగినా కూడా సామాన్య భక్తుల దర్శనం నిరంతరం కొనసాగుతూ ఉంటుందన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో భక్తులందరికీ అన్నప్రసాదాలు, వాటర్ బాటిళ్లను అందజేస్తామన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమినేతల సహకారంతో దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న దసరా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వారికి ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా త్వరితగతిన అమ్మవారి దర్శనము అయ్యేలా చర్యలను తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే స్థానిక శాసనసభ్యులు సుజనా పలుమార్లు ఉత్సవాల నిర్వహణపై సమీక్షలను నిర్వహించారు అన్నారు. మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలని సమర్పిస్తారని తెలిపారు. పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) శాసనసభ్యులు సుజనా చౌదరి కూటమి నాయకుల సహకారంతో ఐక్యంగా అమ్మవారి  ఉత్సవాలను  ఘనంగా నిర్వహిస్తామన్నారు. రోజుకి రెండు లక్షలమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది కనుక గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఆటంకాలు జరగకుండా అందరి సహకారంతో  విజయవంతంగా దసరా ఉత్సవాలను పూర్తి చేస్తామన్నారు.

Related Videos