మాజీ మంత్రి సీనియర్ మోస్ట్ లీడర్... నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం ఆయన సొంతం. ఆయనే ఉత్తరాంధ్ర కు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆయన కొంతకాలంగా రాజకీయ వైరాగ్యాన్ని పాటిస్తున్నారు. పార్టీ ఓడాక తొలి నాళ్ళలో తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు వెళ్లి జగన్ నిర్వహించిన సమీక్షలో పాలుపంచుకున్నారు. ఆ మీదట ఆయన మళ్లీ కనిపించలేదు. ఆయన ఇపుడు రాజకీయంగా డోలాయమానంలో ఉన్నారని అంటున్నారు.
ఆరున్నర పదుల వయసులో మరోసారి పార్టీ మారడమా అన్న ఆలోచన ఒక వైపు ఉంటే ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెబితే ఎలా ఉంటుంది అన్నది మరో ఆలోచన. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తులు చూసిన ధర్మాన ప్రసాదరావు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక జూనియర్ లీడర్ చేతిలో ఓటమి పాలు అయ్యారు. ఆ విధంగా రాజకీయ చరమాంకం భారీ ఓటమిని ఇచ్చిందని ప్రసాదరావు మదనపడుతున్నారని అంటున్నారు. వైసీపీ అధినేత జగన్ ఒత్తిడి మేరకు ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఫలితం తేడా కొట్టేసింది. ఆయనలో అసంతృప్తికి మరో కారణం ఏంటి అంటే తన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని అడిగారు. దానికి జగన్ నో చెప్పి ధర్మాననే పోటీకి పెట్టారు. ఆ విధంగా తన కుమారుడి రాజకీయ జీవితం చక్కదిద్దు కోలేక పోయాను అన్న బాధ ఆయనకు ఉందని అంటున్నారు.
వైసీపీ రాజకీయాలతో పూర్తిగా దూరంగా ఉంటున్న ఆయన ఇక పాలిటిక్స్ కి గుడ్ బై కొట్టేసి కుమారుడిని టీడీపీలోకి పంపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. శ్రీకాకుళం శాసన సభ సీటు టీడీపీకి కంచుకోట. టీడీపీ ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీనే తక్కువ సార్లు గెలిచింది. ఒకసారి వైసీపీ గెలిచింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి మొత్తం క్యాడర్ టీడీపీకి మళ్ళింది. ఓటమి తరువాత ఇపుడు మరింత బలహీనపడిందని అంటున్నారు. దాంతో వైసీపీలో కంటే టీడీపీలో ఉంటే తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందేమో అన్న ఆలోచనలలో పెద్దాయన ఉన్నారనే మాటలు వినిపిస్తున్నాయి. కుమారుడి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని సైకిలెక్కించి తాను మాత్రం రాజకీయ విరమణ చేస్తే ఉభయత్రా బాగానే ఉంటుందని ఆలోచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos