ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష కూటమి నేతలపై వీడియోలతో నిత్యం చెలరేగిపోయిన ఆ పార్టీ సానుభూతిపరురాలు శ్రీరెడ్డికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా నేతల్ని వరుసగా అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో శ్రీరెడ్డి అరెస్టు కూడా తప్పదనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే ఆమెపై అనకాపల్లితో పాటు రాజమండ్రిలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మంత్రి నారా లోకేష్ తో పాటు వైసీపీ అధినేత జగన్ కు ఆమె రెండు లేఖలు రాశారు.
జగనన్న, భారతమ్మకు నమస్కారాలు అంటూ శ్రీరెడ్డి లేఖను ప్రారంభించారు. ఈ జన్మకు మీ ఇద్దరినీ టీవీలో కాకుండా నిజంగా చూసే అదృష్టం లేదనుకుంటా అని తెలిపారు. ఓ ఫొటో కూడా తీసుకునే అదృష్టం కోల్పోయానని తెలిపారు. తన పేరుతో వైసీపీకి చెడ్డపేరు తెచ్చానని, తాను చేసిన పనికి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎంతో మంది దుమ్మెత్తి పోయడమే తనను మానసికంగా కుంగదీస్తోందన్నారు. పార్టీని ప్రత్యర్థుల మాటల దాడి నుంచి కాపాడటానికి అనుకుంటూ ఎక్కువ డ్యామేజ్ చేశానన్నారు.
తాను వైసీపీ సభ్యురాలిని కాకపోయినా సాక్షిలో పనిచేసినప్పటి నుంచి మీ ఇద్దరి మీద గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయని తెలిపారు. వైసీపీ ముందునుంచీ పడిన కష్టాలు చూసి ఉడతాభక్తిగా జగనన్నకు సాయం చేద్దామనుకున్నట్లు తెలిపారు. వీర విధేయతతో ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసే క్రమంలో పార్టీని డ్యామేజ్ చేస్తున్నట్లు అనుకోలేదన్నారు. తాను చేసిన ప్రతీ పని వల్ల మీరెంత బాధపడ్డారో తెలుసని, తన పాపం మీకు అంటుకోవద్దని చెప్పుకొచ్చారు. కాబట్టి పార్టీకి, కార్యకర్తలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు. తన వల్ల పార్టీకి చెడ్డపేరు రావడం ఇష్టం లేదని, క్షమించాలని కోరింది.
ఆ తర్వాత మంత్రి నారా లోకేష్ కు ఓ లేఖ రాసి ఎక్స్ లో శ్రీరెడ్డి పోస్టు చేశారు. ఇందులో తాను పుట్టింది గోదావరి జిల్లాలోనే అయినా పెరిగింది మాత్రం విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే అన్నారు. అలాగే 95 శాతం మీ వాళ్లే నా ఫ్రెండ్స్ అన్నారు. తన తల్లితండ్రులు కూడా అక్కడే ఉంటారని, అమరావతి రాజధాని కావడం వల్ల వాళ్ల అరకొర సొంత ఇల్లు రేట్లు పెరిగాయని టీడీపీకే ఓట్లు వేశారని గుర్తుచేశారు. మీరు కొన్ని విషయాల్లో ఎంత మొండిగా ఉంటారో అంత మంచిగా ఉంటారని, అందుకే తాను గత వీడియోలో తన కుటుంబసభ్యులు సారీ కూడా చెప్పించారన్నారు. అలాగే మీతో డైరెక్ట్ గా మాట్లాడమని చెప్పారని, కానీ తనకు అంత స్థాయి లేక ఈ లెటర్ రాస్తున్నట్లు తెలిపారు.
గతంలో తాను టీడీపీ, జనసేన నేతల్ని ఎంత దూషించానో తెలుసని, అందుకే క్షమాపణలు చెప్పానని, ఆ వీడియో కింద మీ అభిమానులు పెట్టిన కామెంట్స్ చూసి ఎంతమంది మనోభావాల్ని దెబ్బతీశానో అర్దమైందని శ్రీరెడ్డి తెలిపారు. వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెప్తున్నానని తప్పుచేసినట్లు అంగీకరిస్తున్నానని, అలాగే చంద్రబాబు, లోకేష్, పవన్ కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ, జనసేనకు అండగా ఉన్న మీడియా సంస్థలకు కూడా సారీ చెప్తున్నానని శ్రీరెడ్డి ఈ లేఖలో వెల్లడించారు. ఈ లేఖ తాను తప్పించుకోవడానికి కాదని, ఈ వారం రోజులుగా కామెంట్స్ చదివి ఆహారం కూడా తీసుకోకుండా మనోవేదనతో తీసుకున్న నిర్ణయమని అన్నారు. తిరిగి వైసీపీ అధికారంలోకి వచ్చినా నా బుద్ధి వక్రమవుతుందని అనుకోవద్దని అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos