కోనసీమ వాసులకు గుడ్ న్యూస్‌. అప్పుడెప్పుడో 2000లో ప్రారంభమైన ప్రాజెక్టుకు ఇన్నాళ్లకు కదలిక వచ్చింది. కోర్టు కేసులు ఇతర సమస్యలతో మూలనపడిన రైల్వే ప్రాజెక్టు ఇప్పుడు వేగంగా సాగుతోందని ప్రజలు భావిస్తున్నారు. కోనసీమ రైల్వేలైన్‌ నిర్మాణానికి 2000లో శంకుస్థాపన చేశారు. కాకినాడ నుంచి కోటిపల్లి, అమలాపురం, రాజోలు, సిద్ధాంతం మీదుగా నర్సాపురం వరకు ఈ కోస్తా రైల్వే లైన్ నిర్మించాలని అప్పట్లో ప్రభుత్వం భావించింది. తొలి అలైన్‌మెంట్‌ 2001లో వచ్చింది. కాకినాడ నుంచి కోటిపల్లి వరకు పనులు కూడా మొదలయ్యాయి. వివిధ కారణాలతో అక్కడి నుంచి ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. ఇప్పుడు కోర్టు కేసులు క్లియర్ కావడంతో ప్రక్రియ ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి.

రైల్వేలైన్‌ భూసేకరణ, రీ అలైన్‌మెంట్‌ సర్వేల విషయంలో చాలామంది రైతులు కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో తక్కువ పరిహారం ఇచ్చారని మరింత కావాలంటూ కోర్టుల్లో పిటిషన్లు వేశారు. పరిహారంలో జరిగిన అన్యాయాన్ని సరి చేయాలని పాతికేళ్లుగా పోరాడుతున్నారు. దీంతో పనులపై ఇన్ని రోజులు కోర్టులు స్టే విధించాయి. ఇన్ని రోజులు విచారణ తర్వాత కోర్టులు ఆ స్టేలను ఎత్తివేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీంతో పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా పోయింది.

కాకినాడ నుంచి కోటిపల్లి వరకు అంటే దాదాపు 45కిలోమీటర్ల నిర్మాణం పూర్తి అయింది. ఇంకా యాభై కిలోమీటర్లకు పైగా లైన్ నిర్మించాల్సి ఉంది. కోటిపల్లి నుంచి నర్సాపురం ఉన్న భూసేకరణ సమస్యతో పనులకు ఆటంకం ఏర్పడింది. కోటిపల్లి నుంచి భట్నవిల్లి వరకు భూసేకరణ ప్రక్రియ పూర్తి అయింది. అక్కడి నుంచి నర్సాపురం వరకు చేపట్టాల్సిన భూసేకరణే ఈ ప్రాజెక్టుకు అడ్డంకిగా మారింది. ఏదోలా చేసి పనులు పూర్తి చేయాలని 2016 నుంచి జరుగుతున్న ప్రయత్నాలు సఫలం కాలేదు. కోర్టు కేసులతోపాటు అలైన్‌మెంట్‌లో వచ్చిన సమస్యలు కూడా పనులు జాప్యానికి కారణంగా చెప్పవచ్చు. ఇప్పుడు కొత్త అలైన్మెంట్‌కు ఆమోదం లభించడంతోపాటు, కోర్టు కేసులు ఎత్తివేయడంతో అధికారులు పనులు వేగం పెంచారు.  భూసేకరణ ప్రక్రియ వేగం పెంచారు. ఈ సేకరణ పూర్తి అయితే పెండింగ్ పనులు పూర్తి కావడానికి ఎంతో సమయం పట్టదని అధికారులు అంటున్నారు.

Related Videos