ఏపీలో అధికారం ఎవరికనేది త్వరలో తేలిపోనుంది. ఇప్పటికే పార్టీల అధినేతలకు ఎన్నికల ఫలితం పైన స్పష్టత వచ్చింది. సర్వే సంస్థలు తమ అంచనాలు ఎగ్జిట్ పోల్స్ రూపంలో వెల్లడించటానికి సిద్దం అయింది. ఈ సమయంలో పోస్టల్ బ్యాలెట్, ఉద్యోగుల ఓటింగ్ సరళి పైన స్పష్టత వస్తోంది. వైసీపీకి ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ లెక్కలతో వైసీపీ విభేదిస్తోంది. దీంతో.. అసలు లెక్కలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో ఏపీ ఉద్యోగులు నవ చరిత్ర సృష్టించారు. రెట్టింపు సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. దాదాపు 5.40 లక్షల పోస్టల్ బ్యాలెట్లను ఉద్యోగులు వినియోగించారు. ఎన్నికల విధుల్లోని ఉద్యోగులు ఈ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నారు. వారితోపాటు తొలిసారిగా ప్రవేశ పెట్టిన హోమ్ ఓటింగ్ విధానంలో 13,700 మంది 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 12,700 మంది దివ్యాంగులు పోస్టల్ బ్యాలెట్ తో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారీగా పెరిగిపోయాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రావడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యంగా సాగే అవకాశం ఉంది.. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో సుమారు 5 లక్షల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. యూటీఎఫ్, ఏపీటీఎఫ్, పీఆర్టీయూ, ఎన్జీవో సంఘాల్లోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశాంత ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా కనిపించిందనే విశ్లేషణలు ఉన్నాయి. అదే జరిగితే 5 లక్షల ఉద్యోగుల ఓట్లల్లో ప్రభుత్వానికి 30 శాతమే అనుకూల ఓట్లు పడతాయని, అంటే 1.5 లక్షల కుటుంబాలు వైసీపీకి మద్దతు పలికితే.. 3.5 లక్షల కుటుంబాలు వ్యతిరేకిస్తాయని రాజకీయ పరిశీలకుల అంచనా. ఇదే జరిగితే 14 లక్షల ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడినట్టే. అంటే.. 0.46 శాతం ఓట్లు వ్యతిరేక ప్రభావం చూపినట్టేనని లెక్కలు బయటకు వస్తున్నాయి. తాజాగా కొన్ని కారణాలతో పోస్టల్ బ్యాలెట్ ఆమోదం సైతం వివాదాస్పదంగా మారింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతి పోస్టల్ బ్యాలెట్‌ను అక్కడ ఉన్న అభ్యర్థి ఏజెంట్లకు చూపించి అనంతరం అతి చెల్లుతుందా లేదా అని తేల్చాల్సి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ కవర్ ఏ తోపాటు ఓటర్ డిక్లరేషన్ ఫామ్ విడిగా ఉంటే ఆ ఓటు చెల్లకుండా పోతుంది. గెజిటెడ్ సంతకం లేకపోయినా ఓటు చెల్లదు. పోస్టల్ బ్యాలెట్ వెనుక ఆర్‌వో సంతకం ఉండాలి. అయితే ఈసారికి దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని టీడీపీ కోరింది. ముఖేష్‌కుమార్ మీనా మౌఖికంగా ఓకే చెప్పినా ఇంత వరకు అధికారిక ఉత్తర్వులు రాలేదని తెలుస్తోంది. దీని పైన వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో..ఈ సారి ఉద్యోగుల పోలింగ్..పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మరింత ఉత్కంఠతకు కారణమవుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos