టీడీపీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు ఇవాళ కొత్త పాత్రలోకి అడుగుపెట్టారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో వైసీపీ ఎంపీగా పనిచేసి, తాజా ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రఘురామరాజును డిప్యూటీ స్పీకర్ గా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆయన పేరుతో నిన్న మూడు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. రఘురామకు పోటీగా ఇంకెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ ప్రకటించారు.

నరసాపురానికి చెందిన రఘురామకృష్ణంరాజు తొలిసారి 2019లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఆరు నెలల్లోనే ప్రభుత్వంతో, అప్పటి సీఎం జగన్ తో విభేదించి విమర్శలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలు వైరల్ కావడంతో ప్రభుత్వం అప్పట్లో రాజద్రోహం కేసు కూడా పెట్టింది. అనంతరం పోలీసులు అరెస్టు చేసి గుంటూరు సీఐడీ కార్యాలయంలో చిత్రహింసలు పెట్టారు. అనంతరం దీనిపై సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఆయన బెయిల్ తెచ్చుకున్నారు. చివరికి ఎంపీగా ఉంటూ ఐదేళ్ల పాటు నియోజకవర్గానికి సైతం దూరమయ్యారు.

ఈ క్రమంలో కూటమికి దగ్గరైన రఘురామకృష్ణంరాజుకు ఎంపీ టికెట్ లభిస్తుందని భావించినా అలా జరగలేదు. చివరలో టీడీపీలో చేరి ఉండి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని గెలిచారు. అనంతరం ప్రభుత్వంలో కీలక పదవి ఉంటుందని భావించారు. అదీ జరగలేదు. చివరికి స్పీకర్ పదవి అయినా దక్కుతుందని ఆశించినా అవకాశం రాలేదు. చివరికి డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. దీంతో ఆయన తొలిసారి కొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఇంతకాలం వైసీపీ నేతలపై కౌంటర్లు వేసి నిలువరించిన ఆయన... ఇప్పుడు ఈ పాత్రను ఎంత మేరకు సమర్థంగా నిర్వహిస్తారో చూడాలి మరి.

Related Videos