ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సకాలంలో ఇళ్లను పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు రూ.2,378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గృహ నిర్మాణ నిధులు దాదాపు రూ.3,598 కోట్లను మళ్లించి నిరుపేదలకు ఎంతగానో అన్యాయం చేసిన ఘనత గత ప్రభుత్వానిదేనని ఆయన తప్పు పట్టారు. నిరుపేదలు అందరికీ శాశ్వత గృహ వసతి కల్పించడంలో పూర్తి స్థాయిలో విఫలమైన గత ప్రభుత్వం ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయడం ఎంతో విడ్డూరంగా ఉందని అన్నారు.
రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు గృహ నిర్మాణాలపై కేంద్రం రూ.20,726 కోట్లు రాష్ట్రానికి కేటాయిస్తే, ఆ నిధులను సక్రమంగా వినియోగించుకోకపోవడమే కాకుండా ఇళ్లను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు రూ.2,378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018 లో ఆవాస్ సర్వే రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించి పీఎం గ్రామీణ్ - 1.0 కింద 3,18,987 మంది లబ్దిదారులను గుర్తించి కేంద్ర వెబ్ సెట్ లో ఫీడ్ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని అంతా వక్రీకరిస్తూ టీడీపీ ప్రభుత్వంపై బురద జల్లే విధంగా ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
వచ్చే ఐదేళ్లలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి శాశ్వత గృహ వసతి కల్పించాలనే దృడనిశ్చయంతో టీడీపీ ప్రభుత్వం ఉందని చెప్పారు. పీఎం గ్రామీణ్- 1.0 పథకం వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరాంతానికి పూర్తి కావాల్సి ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఆ పథకాన్ని 2025 డిసెంబర్ వరకూ పొడిగించామని అన్నారు. ఈ పథకం కింద తమ ప్రభుత్వం 1.15 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేసిందని, మిగిలిన 7.35 లక్షల గృహాల్లో 1.50 లక్షల గృహాలను ఈ జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుందామని అన్నారు.
అదేవిధంగా పీఎం గ్రామీణ్ - 2.0 పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి పార్థసారథి అన్నారు. ఈ పథకం కింద లబ్దిదారులను గుర్తించే సర్వే ఇప్పటికే మొదలైందని, ఇప్పటి వరకూ 11,600 లబ్దిదారులను గుర్తించామన్నారు. ఈ మార్చి నెలాఖరు నాటికి మరో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయించుకోవాలనే లక్ష్యంతో లబ్దిదారులు గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశామని మంత్రి తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos