దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసిన తిరుమల లడ్డు వివాదం పైన నిజా నిజాల నిగ్గు తేల్చేందుకు
ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన  సిట్  ఈ రోజు నుంచి తిరుమలలో  విచారణ ప్రారంభిస్తుంది. అటు ప్రతిపక్ష వైసీపీ లడ్డు కలుషితం అనేది రాజకీయ ప్రేరేపిత కుట్రగా ఆరోపిస్తున్నది. ఇప్పటికే ఈ వివాదం పైన వైసీపీ అధినేత జగన్ ... ప్రధాని మోడీ, సుప్రీం సీజేకు లేఖ రాశారు. ఇదిలా ఉండగా ఇదే సమయంలో తిరుమల లడ్డు వివాదంపై సుప్రీం కోర్టులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ పైన కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ వివాదంలో నిజం నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేయడం... అదే సమయంలో లడ్డు వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మరో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు పిటిషన్ల పైన సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని నిర్ణయించి... ఆ బెంచ్ కు  ఈ కేసును కేటాయించారు. ఈ నెల 30న సుప్రీంకోర్టు ఈ కేసును విచారించనుంది. ఆ రోజున విచారించే కేసుల్లో తిరుమల లడ్డు కేసు లిస్ట్ అయింది.

సుబ్రహ్మణ్యస్వామి ఈ కేసులో స్వయంగా తన వాదనలు వినిపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వివాదం పైన రాజకీయంగా పెద్ద ఎత్తున రగడ కొనసాగుతోంది. ఈ కేసుల విచారణ అనంతరం  సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కీలకంగా మారనుంది.

Related Videos