ఏపీలో ఎవరిది అధికారం. వైసీపీకి ప్రజలు పట్టం కట్టారా... చంద్రబాబు వైపే మొగ్గు చూపారా. ఈ సస్పెన్స్ కు జూన్ 4న తెర పడనుంది. ఈ సమయంలోనే పార్టీల ముఖ్య నేతలు తమ విజయం పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. లోలోపల మాత్రం టెన్షన్ తోనే ఉన్నట్లు స్పష్టం అవుతోంది. హోరా హోరీగా సాగిన ఎన్నికల సమరంలో ఓట్ల లెక్కింపులోనూ అదే ఫైట్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే, కూటమి విజయం సాధించాలంటే మాత్రం ఇలా జరిగితేనే సాధ్యం అంటూ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. మొత్తం 175 నియోజకవర్గాల్లో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసింది. అధికారంలోకి రావాలంటే కూటమికి 88 సీట్లు గెలవాల్సి ఉంది. ఈ సారి పోలింగ్ శాతం పెరిగింది. పెరిగిన ఓట్ల శాతం ఎవరికి అనుకూలిస్తుందనే అంశం పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జగన్ పోలింగ్ తరువాత ఐప్యాక్ తో సమావేశం సమయంలో తాము 151 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నేతల నుంచి ఈ స్థాయిలో ప్రకటనలు రాలేదు. కానీ, పోలింగ్ సరళి పరిశీలించిన తరువాత రాష్ట్రంలోనూ మూడు రీజియన్ల వారీగా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే లెక్కలు వేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు ప్రభావం చూపించాయనే నిర్ధారణకు వచ్చారు. 2019 ఎన్నికల్లో  రాయలసీమలో గెలిచిన 49 సీట్లతో  వైసీపీ 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఈ సారి కూడా రాయలసీమలో భారీ సీట్లు సాధిస్తామని వైసీపీ అంచనా వేస్తోంది. టీడీపీ గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తుందనే నమ్మకం కనిపిస్తోంది. అయితే..సీమలోని రెండు జిల్లాల్లో వైసీపీ మెరుగైన ఫలితాలు దక్కించుకొనే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. అదే సమయంలో గ్రేటర్ రాయలసీమగా చెప్పుకొనే సీమ లోని నాలుగు జిల్లాలతో పాటుగా నెల్లూరు, ప్రకాశం వరకు వైసీపీ ప్రభావం ఎక్కువగా కనిపించిందని రాజకీయ చర్చల్లో విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ తాము సైతం ఈ జిల్లాల్లో గట్టిగా ప్రభావం చూపించామని వివరిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ గతం కంటే మెరుగ్గా సీట్లు సాధిస్తుందని ఆ నేతల విశ్లేషణ. వైసీపీ నేతల వాదన పరిగణలోకి తీసకుంటే... శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకు టీడీపీ కూటమి సాధించే సీట్లు కీలకం కానున్నాయి. దాదాపుగా 70 సీట్ల వరకు ఈ ఏడు జిల్లాల్లో కూటమి సాధిస్తే విజయం ఖాయమనే చర్చ జరుగుతోంది. అయితే...ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో వైసీపీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందనే మరో లెక్క తెర మీదకు వచ్చింది. ఉభయ గోదావరి జిల్లాల్లో పూర్తి ఏకపక్షంగా గెలుస్తామని టీడీపీ కూటమి చెబుతోంది. కానీ, పశ్చిమం కంటే తూర్పు గోదావరిలో వైసీపీ గట్టి పోటీ ఇచ్చినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్న లెక్క. కృష్ణా, గుంటూరులోనూ తాము మెజార్టీ సీట్లు దక్కించుకుంటామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో...టీడీపీ కూటమి ఎన్నికల్లో గెలవాలంటే ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తా లోని ఏడు జిల్లాలే కీలకం కానున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

Related Videos