ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ విశాఖలో భారీ మొత్తంలో డ్రగ్స్ సీజ్ చేసిన ఘటన వైసిపి నేతల తలకు చుట్టుకునేలా వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలో విశాఖలో సీజ్ చేసిన డ్రగ్స్ కంటైనర్ ఏపీ​లో ప్రకంపనలు సృష్టిస్తోంది. విశాఖ పోర్టుకు ఈ నెల 16వ తేదీన చైనా నౌక ద్వారా కంటైనర్‌ విశాఖ వచ్చినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. అదే రోజున దిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు స్థానికంగా కస్టమ్స్‌ అధికారుల సాయంతో కంటైనర్​ను తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే సీబీఐ అధికారులకు ఆటంకాలు కలించడానికి వైసీపీ నేతలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. లక్షల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ దొరక్కుండా అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించారని సమాచారం. కంటైనర్ తెరిచి నమూనాలు సేకరించి పరీక్షించే సమయంలోనూ సీబీఐకి సహకరించాల్సిన అధికారులు అడ్డంకులు సృష్టించినట్లు తెలుస్తోంది. ఈ కంటైనర్‌ సంధ్యా ఆక్వా పేరుతో బుక్‌  అయినందున సంధ్య ఆక్వా ఎక్స్‌ పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహా, గుర్తు తెలియని మరికొందరిపైనా కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే నిత్యం ఎక్కడో ఒకచోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. గంజాయికి బానిసలుగా మారుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పుడు డ్రగ్స్​ సైతం వ్యాప్తి చెందుతుండడంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. వీటన్నింటికీ జగన్‌ ప్రభుత్వమే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ పోర్టు చరిత్రలోనే ఇంత భారీస్థాయిలో డ్రగ్స్‌ పట్టుబడడం పోర్టు వర్గాలను కుదిపేస్తోంది. నిషేధిత డ్రగ్స్‌ ఖరీదు గ్రాముల్లోనే వేలల్లో ఉంటుంది. అలాంటిది 25 వేల కిలోల విలువ ఎంత ఉంటుందో అనేది తేలాల్సి ఉంది.

Related Videos