ఢిల్లీలో ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మూడు కీలక నిర్ణయాలు తీసుకోవడంపై ఆ రాష్ట్రంలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. మూడు నిర్ణయాల్లో ఒకటి పసుపుబోర్డు , మరొకటి అయిన సమ్మక్క- సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం అంశాలపై ఎక్కడా ఎలాంటి వివాదం తలెత్తలేదు. కానీ ఇంకొక అంశమైన కృష్ణా జలాల పంపకానికి సంబంధించి ... ప్రస్తుతం ఉన్న ట్రైబ్యునల్ కే కొత్త విధివిధానాలు ఖరారు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై ఏపీలో తీవ్ర వివాదాస్పదంగా మారింది. కేంద్రం నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలకు శరాఘాతంగా మారే ప్రమాదం పొంచి ఉన్నా ముఖ్యమంత్రి జగన్ నుంచి ఉలుకూ పలుకూ లేదనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై రాయలసీమ సహా కృష్ణా పరీవాహక ప్రాజెక్టుల పరిధిలోని రైతులతో పాటు సాగునీటి రంగ నిపణులు, విశ్రాంత ఇంజినీర్లు కలవరపడుతున్నారు. ఒక్క రాయలసీమ ప్రాజెక్టులకు మాత్రమే కాదు... ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచో ఉన్న కేటాయింపులకు కూడా సవాల్ ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉందని వారు పేర్కొంటున్నారు. కర్ణాటక ఎన్నికల సమయంలో అప్పర్ భద్రను కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. దాని నిర్మాణానికి అవసరమైన నీళ్లే లేవని ఏపీ అభ్యంతరం చెబుతున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సమయంలో ఏపీ వాదనకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర డిమాండ్ కు అనుగుణంగా కృష్ణా జలాల పునఃసమీక్షకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నిర్ణయాలూ ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రయోజనాలకు తీవ్ర భంగం కలిగించేలా ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
వైకాపా ప్రభుత్వం, సీఎం జగన్ నుంచి నాలుగేళ్లుగా తగిన ప్రతిఘటన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఈ ప్రతిపాదన కేంద్ర మంత్రిమండలి ముందుకు వెళ్లేవరకు ఎందుకు ప్రేక్షకపాత్ర పోషించారని... ఎన్డీయే ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదనేవి అంతుపట్టని ప్రశ్నలు. తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా జలాల పంపకం బాధ్యతను బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌కు అప్పగించి... కొత్త విధివిధానాలను ఖరారు చేస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న ప్రస్తుత నిర్ణయం ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కలవరపడుతున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సారథ్యంలో 2020లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడే జగన్ అభ్యంతరం చెప్పి ఉంటే ఇప్పుడు ఈ నిర్ణయం వెలువడేది కాదని అంటున్నారు. బచావత్, బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునళ్లు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను ఆంధ్ర, తెలంగాణకు చెరి సగం పంచాలని తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న వాదనకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. దీనివల్ల.. అనుమతుల్లేకుండానే తెలంగాణ నిర్మించిన, నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ సక్రమమైపోతాయని.. ఇదే జరిగితే రాయలసీమ శాశ్వతంగా ఎడారిగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రైబ్యునల్ 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలికంగా కేటాయించారు. కానీ.. తెలంగాణ ప్రభుత్వం చెరిసగం నీటివాటాను డిమాండ్ చేస్తోంది. జగన్ సీఎం అయ్యాక తెలంగాణ అనుమతుల్లేకుండా చేపట్టిన ప్రాజెక్టులపై నోరెత్తడం లేదు. మధ్యలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చినా ఎన్‌జీటీ స్టే ఇవ్వడంతో పనులు ఆగిపోయాయి. స్టే ఉత్తర్వుల ఎత్తివేత దిశగా జగన్ ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ అవార్డును ఇంతవరకు నోటిఫై చేయని ప్రస్తుత పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ వ్యవహారాన్ని తేల్చే బాధ్యతను మళ్లీ అదే ట్రైబ్యునల్‌కు కేంద్రం కట్టబెట్టడం గమనార్హం. తెలంగాణ ప్రాజెక్టులకు ట్రైబ్యునల్ గనుక నీటి కేటాయింపులు చేస్తే రాయలసీమకు ఇక నీళ్లు రావన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బచావత్ ట్రైబ్యునల్ అవార్డును నోటిఫై చేయనందున.. తిరిగి 4 రాష్ట్రాలకు కలిపి కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేసినట్లుగానే భావించాల్సి ఉంటుందని, కేంద్రం నిర్ణయం న్యాయపరంగా చెల్లుబాటు కాదనీ నిపుణులు వాదిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నీటిని పంచాలని... అది పూర్తయ్యాక.. ఏమైనా వివాదాలు ఉంటే .. మహారాష్ట్ర, కర్ణాటకతో కలిపి మళ్లీ కొత్తగా ట్రైబ్యునల్ వేసి తేల్చాల్సి ఉంటుందని వారు అంటున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కొత్తదని ఇప్పటికే బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ చెప్పిందని... రేపు దానికి నీటి కేటాయింపులు జరిపితే ఏపీకి నష్టం వాటిల్లుతుందని ... రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేయాలని అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos