మాజీ సీఎం జగన్ పూర్తిగా పార్టీ పైన ఫోకస్ చేసారు. ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో అమలు చేసిన నిర్ణయాలు పరాజయానికి కారణంగా గుర్తించారు. దీంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. పార్టీని బలోపేతం చేసే క్రమంలో తీసుకుంటున్న తాజా నిర్ణయాల పైన ఇప్పుడు సొంత పార్టీలోనే చర్చ సాగుతోంది.
తాజాగా జరిగిన ఎన్నికల సమయంలో పార్టీ విజయం పై చివరి వరకు జగన్ ధీమాగా కనిపించారు. తన నిర్ణయాలే తనకు తిరిగి అధికారం ఇస్తాయనే విశ్వాసంతో కనిపించారు. కానీ, ఫలితం తారు మారు అయింది. పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. ఫలితాల పైన జగన్ సమీక్షించి లోపాలను గుర్తించారు. పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను వెంటనే ప్రారంభించారు. పార్టీ పరంగా రాష్ట్ర స్థాయి నుంచి మార్పులు మొదలు పెట్టారు. పార్టీ ప్రక్షాళన దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
జగన్ అన్ని జిల్లాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతం కంటే భిన్నంగా పార్టీ నేతలకు టైం ఇస్తున్నారు. ఓటమికి కారణాలను చర్చిస్తున్నారు. భవిష్యత్ పైన భరోసా ఇస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ జిల్లాల అధ్యక్షులను ఖరారు చేస్తున్నారు. ఎన్నికల ముందు భారీ స్థాయిలో జగన్ నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ ల మార్పు చేసారు. ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేసారు. ఆ సమయంలోనే ఈ మార్పుల పైన అభ్యంతరాలు వచ్చాయి. కానీ, జగన్ వినిపించుకోలేదు. సామాజిక సమీకరణాల పేరుతో ఈ మార్పులు చేసారు. కానీ, ఎన్నికల్లో మాత్రం ఈ నిర్ణయాలు బూమ్ రాంగ్ అయ్యాయి.
దీంతో, ఇప్పుడు జగన్ ఆ నిర్ణయాలను మార్పు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలను గతంలోని వారి సొంత నియోజకవర్గాలకే తిరిగి సమన్వయకర్తలుగా నియమిస్తున్నారు. తాజాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి మల్లాది విష్ణు, పశ్చిమ నియోజకవర్గానికి తిరిగి వెల్లంపల్లి శ్రీనివాసరావును నియమించారు. పార్టీ వీడిన సామినేని స్థానంలో జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా తన్నీరు నాగేశ్వరరావు నియమతులయ్యారు. పార్టీని బలోపేతం చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. జగన్ చేస్తున్న ఈ దిద్దుబాటు చర్యలు పార్టీకి మేలు చేస్తాయా లేదా అనేది చూడాలి మరి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos