గనుల దోపిడీకి పాల్పడిన వారికి అండగా ఉన్నారని ప్రధాన పాత్ర పోషించారని వెంకట రెడ్డి అనే అధికారిని ఏసీబీ అరెస్టు చేయగా ... ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. ఆయన్ని కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు ఏసీబీ ప్రయత్నం చేస్తోంది. ఇంతలో ప్రభుత్వానికి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల కీలక సూచనలు చేశారు. పట్టుకోవాల్సింది చిన్న చిన్న వ్యక్తుల్ని కాదని పెద్ద పెద్ద వారిపై ఫోకస్ చేయాలని సూచించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకటరెడ్డి లాంటి తీగలే  కాదు. పెద్ద డొంకలు కూడా కదలాలి. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్‌లో ఉన్నా విచారణ జరపాలని వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి షర్మిల కామెంట్ చేశారు. ముందున్న అధికారి వందల కోట్లు దోచుకుంటే వెనకున్న వాళ్ల దోపిడీ ఎంత ఉంటుందో ఊహించుకోవాలని అన్నారు షర్మిల. ఆ వ్యక్తి ఎవరో ప్రజలకు బాగా తెలుసని అన్నారు. " రూ.2,566 కోట్ల దోపిడీకి పాల్పడ్డ  ఘనుడు వెంకట రెడ్డి అయితే, తెరవెనుక ఉండి, సర్వం తానై, వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇదేళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకుతిన్నారని... అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారని ఆమె ఆరోపించారు.

ఈ భారీ దోపిడీపై ఒక్క ఏసీబీ విచారణ మాత్రమే సరిపోదన్న షర్మిల... సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. "గత ప్రభుత్వ హయంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై ఏసీబీ చారణతో పాటు పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని..  చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకొనేలా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. సహజ వనరుల దోపిడీపై సీబీఐ విచారణను కోరాలని కూటమి సర్కార్‌ను డిమాండ్ చేస్తున్నామని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Related Videos