లక్షల ఎకరాల ఎసైన్డ్ భూములను కొట్టేసే కుట్రకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత ఏడాదే తెరలేపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలని ఉద్ధరిస్తున్నామంటూ ఎసైన్డ్ భూముల్ని 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని చట్టసవరణ చేసింది. జీఓ జారీకి ముందే ముఖ్య అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు ఒక్కో ప్రాంతంలో వందల ఎకరాల కొనుగోలుకు భారీ ఎత్తున ఒప్పందాలు చేసుకున్నారు. తర్వాత బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేలోగా మరింత భూమిని దోచేయాలనే ప్రణాళికల్లో నేతలు ఉన్నారు. ఇరవై ఏళ్ల కంటే ముందు ఎసైన్ చేసిన వ్యవసాయ భూములు, 10 ఏళ్ల కంటే ముందు పంచిన ఇళ్ల స్థలాలను అమ్ముకునే హక్కు కల్పిస్తూ... 2023 జులై 31 నుంచి అమల్లోకి వచ్చేలా చట్టసవరణ చేస్తూ గతేడాది అక్టోబర్ 27న వైఎస్సార్సీపీ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేస్తూ జీవో 596 డిసెంబరు 19న విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వంలోని ముగ్గురు ఉన్నతాధికారులు చక్రం తిప్పి ఈ జీఓ జారీ చేయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు దీన్ని అడ్డుపెట్టుకుని ఎసైన్డ్ భూములపై ఆధారపడి తరతరాలుగా బతుకుతున్న వర్గాలకు తృణమో, పణమో ముట్టచెప్పి అక్కడ నుంచి తరిమేస్తున్నారు. అంగీకరించకపోతే బెదిరించి, భయపెట్టి లాక్కుంటున్నారు. విశాఖ వంటిచోట్ల పేదలకు గతంలో ఇచ్చిన భూముల ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటిచోట్ల 50- 70శాతం వరకు భూములు అధికార పార్టీ పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి. విశాఖ, ఉమ్మడి కృష్ణా, కడప, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లోని అర్హులైన దళితులకు చెందిన భూములదీ ఇదే పరిస్థితి. రాష్ట్రంలో ఎసైన్డ్ భూములెన్ని, వాటిలో 2003వ సంవత్సరానికి ముందు ఇచ్చిన భూములెన్ని అనే వివరాలను ప్రభుత్వం దాచిపెడుతోంది. కోనేరు రంగారావు కమిటీ రిపోర్టు ప్రకారం వ్యవసాయ అవసరాల కోసం 1969 నవంబరు 1 నుంచి 2001 మార్చి 31 వరకు ఉమ్మడి రాష్ట్రంలో 42 లక్షల ఎకరాలకు పైగా ఎసైన్డ్ భూములు పంపిణీ చేయగా అందులో ప్రస్తుత ఏపీలో ఇచ్చినవే 26 లక్షల ఎకరాలకు పైగా ఉన్నాయి. గత ఏడాది ఇచ్చిన జీఓ ప్రకారం ఇవన్నీ అమ్ముకునేందుకు వీలు కల్పించినట్లే. అంటే రాష్ట్రంలో 20 శాతం భూములపై పేదలకున్న హక్కులు దూరం కానున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos