దేశ రాజధాని ఢిల్లీకి సీఎంగా ఇవాళ ఆతిశీ ప్రమాణం చేయనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు సీఎం ఆతిశీతోపాటు మరో ఐదుగురు ఢిల్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా.. రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రితోపాటు మంత్రులతోనూ ప్రమాణం చేయించనున్నారు. ఇక ఆతిశీ ప్రమాణ స్వీకరోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ 8వ సీఎంగా ఆతిశీ ప్రమాణం చేయనున్నారు. ఇక ఢిల్లీకి సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్‌ల తర్వాత మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆతిశీ నిలవనున్నారు.

ఇక ఢిల్లీ సీఎంగా ఆతిశీ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో ఆతిశీ సీఎం నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసింది. ఇక ఎమ్మెల్యేలు సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, ముఖేష్ అహ్లావత్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆప్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్‌లో ఆతిశీ ఆర్థిక, రెవెన్యూ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, విద్య వంటి 13 కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. దీంతో కీలక శాఖలను విజయవంతంగా నిర్వహించిన ఆతిశీకే ఢిల్లీ సీఎం బాధ్యతలు ఆప్ అప్పగించింది.
కాగా ఢిల్లీ అసెంబ్లీ గడువు త్వరలోనే ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కొత్త ముఖ్యమంత్రి, కొత్త సభ్యుల పదవీకాలం కొద్ది కాలమే ఉండనుంది.

Related Videos