దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆప్ నేత ఆతిశీ ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో శనివారం సాయంత్రం ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఆతిశీ ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఆప్ ఎమ్మెల్యేలు ఆతిశీని సీఎంగా ఎన్నుకున్నారు. దీంతో దేశ చరిత్రలో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన 17వ మహిళగా ఆతిశీ నిలిచారు.
అత్యంత పిన్న వయసులోనే దిల్లీ ముఖ్యమంత్రిగా చేపట్టనున్న మహిళగా కూడా ఆతిశీ నిలిచారు. దిల్లీకి 15 ఏళ్ల పాటు వరుసగా షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1998 నుంచి 2013 వరకు మూడు పర్యాయాల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసి ఆప్ గద్దెనెక్కింది. జాతీయ రాజకీయాల్లోకి రాక ముందు 1998లో సుష్మా స్వరాజ్ కేవలం 52 రోజుల పాటు సేవలందించారు.
షీలాదీక్షిత్ సీఎంగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆమె వయసు 60 ఏళ్లు. సుష్మాస్వరాజ్ 46 ఏళ్లకే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆతిశీ మాత్రం 43 ఏళ్లకే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అతి తక్కువ వయసులోనే ఈ పగ్గాలు అందుకున్నారు. పైకి సున్నిత వ్యక్తిగా కనిపించే ఆతిశీ మార్లేనా సింగ్ ఫైర్‌బ్రాండే. ఈ పేరుకు దిల్లీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన వాగ్ధాటితో ప్రతిపక్షాలను ముప్పుతిప్పలు పెట్టడంలో ఆమె దిట్ట. దీంతో మద్యం కుంభకోణంతో దుమ్ము కొట్టుకుపోయిన ఆప్ ప్రతిష్ఠను నిలబెట్టే బాధ్యతను పార్టీ అగ్ర నాయకత్వం ఆమె భుజస్కంధాలపై పెట్టింది. ఆప్ నేతల్లో చాలామంది జైలుకు వెళ్లడంతో సౌరభ్ భరద్వాజ్‌తో కలిసి పార్టీని ఆతిశీ ముందుకు నడిపారు.
హరియాణా నుంచి దిల్లీకి రోజుకు 100 మిలియన్ గ్యాలన్ల నీటిని విడుదల చేయడం లేదంటూ ఏకంగా జూన్‌లో నిరాహార దీక్ష చేపట్టారు. ఆతిశీ 1981 జూన్ 8న జన్మించారు. ఆమె పేరు మధ్యలో మార్లేనా అనే పేరు చేర్చడం వెనుక ఓ ఆసక్తికర అంశం ఉంది. ఆమె తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్త వాహి ప్రొఫెసర్లు. వారు కార్ల్ మార్క్స్, లెనిన్ పేర్లలోని కొన్ని భాగాలను కలిపి మార్లేనా అనే పేరును చేర్చారు. 2018 ఎన్నికల ముందు నుంచీ ఆతిశీ తన ఇంటి పేరును వాడటం మానేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos