ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో ఐదు రోజుల్లో వెలువడబోతున్నాయి. మరోవైపు జాతీయ స్ధాయిలో ఈసారి ఎన్డీయే కూటమికి తగినన్ని సీట్లు లభించే అవకాశం లేదని పలువురు సెఫాలజిస్టులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమికి అధికారం చేపట్టేందుకు అవకాశం లభిస్తే తయారుగా ఉండాలన్న చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై చర్చించేందుకు జూన్ 1న ఇండియా కూటమి పార్టీలు కీలక భేటీ కూడా ఏర్పాటు చేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో అధికార వైసీపీతో పాటు విపక్షంలో ఉన్న పార్టీలకు సైతం కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ కు చెందిన కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఈసారి గెలవబోయే ఎంపీలకు కీలక ఆఫర్ ఇచ్చారు. వీరంతా ఇండియా కూటమిలో చేరితే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు అన్ని ప్రయోజనాలు సాధించుకోవచ్చని కోరారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఈసారి గెలవబోయే ఎంపీలంతా ఇండియా కూటమిలోకి రావాలని ఆయన కోరారు. అప్పుడు ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని అన్ని హామీలు సాధించుకునేందుకు వీలుంటుందన్నారు. అలాగే తిరుపతిని రాజధానిగా చేయాలని తన పాత డిమాండ్ కూడా తెరపైకి తెచ్చారు. అంతర్జాతీయ ఎయిర్ పోర్టు సహా మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయన్నారు. తిరుపతిని రాజధాని చేస్తే సీమకు న్యాయం జరుగుతుందన్నారు. కాబట్టి అన్ని పార్టీలు ఈ ప్రతిపాదనకు అంగీకరించాలన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos