లోక్‌సభ ఎన్నికల వేళ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు... నిన్న ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడం సంచలనం కలిగించింది. 2021-22 ఢిల్లీ మద్యం పాలసీ విధానం రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారని.. ఫలితంగా ప్రైవేటు కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా పాలసీని తయారు చేశారని ఈడీ అభియోగాలు మోపింది. ఈ క్రమంలోనే దాదాపు 2 ఏళ్లుగా ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ జరుపుతున్న ఈడీ అధికారులు ఇప్పటివరకు పలువురిని అరెస్ట్ చేశారు. మొత్తం ఏడాదిన్నర కాలంలో 16 మందిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌కు ముందు ఇటీవల తెలంగాణ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి.. ఢిల్లీకి తరలించారు. ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో మొదటి వ్యక్తిని 2022 లో ఈడీ అరెస్టు చేసింది. ఆ మొదటి వ్యక్తి సమీర్ మహేంద్రు కాగా.. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 16 వ వ్యక్తి. ఈ విధంగా అరెస్ట్ అయిన వారిలో పి. శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ, అరుణ్ పిళ్లై, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తదితర ప్రముఖులు ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వం కొందరు మద్యం వ్యాపారులకు లబ్ది చేకూర్చేలా 2021-22 ఆర్థిక సంవత్సరంలో మద్యం విధానాన్ని రూపొందించింది అనేది ఈ కేసులో ఈడీ అధికారులు చేస్తున్న ప్రధాన ఆరోపణ. అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా... ముడుపులు ఇచ్చిన కొందరు ప్రైవేటు వ్యక్తులకు అనుచిత లబ్ధి చేకూర్చడానికి అప్పటి ఉన్నతాధికారులతో కలిసి మద్యం విధానాన్ని రూపొందించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఈ కేసులో ఇప్పటివరకు ప్రముఖులైన 16 మంది వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేయడం సంచలనం కలిగిస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos