మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకూ అనూహ్య మలుపులు తిరుగుతూ రసవత్తరంగా మారుతున్నాయి. కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక వ్యవహారంలో ఏక్‌నాథ్ షిండే తన మనసు మార్చుకోకపోవడం దీనికి ప్రధాన కారణం. స్వయంగా భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జోక్యం చేసుకున్నా ఆయన మెత్తబడట్లేదు.
సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 145 సీట్ల సంఖ్యా బలం బీజేపీకి లేదు. 149 సీట్లల్లో పోటీ చేసి 132 చోట్ల గెలిచింది ఆ పార్టీ. షిండే వర్గం శివసేన 81 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టగా 57 మంది గెలుపొందారు. అజిత్ వర్గానికి చెందిన ఎన్సీపీ మొత్తం 59 స్థానాల్లో పోటీ చేయగా 41 స్థానాలు ఈ పార్టీ ఖాతాలో పడ్డాయి.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే బీజేపీకి మిత్రపార్టీల మద్దతు తప్పనిసరి కావడంతో ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన భీష్మించింది. షిండేకు మరోసారి అవకాశం ఇవ్వాలని లేదా కనీసం 50:50 పవర్ షేర్ ఫార్ములాను అయినా అంగీకరించాలని ప్రతిపాదిస్తోంది. ఇప్పటివరకు షిండే సేన పెట్టిన ఏ ఒక్క డిమాండ్‌కు కూడా బీజేపీ తల ఊపలేదు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ దఫా సీఎం పదవి తమ పార్టీకే దక్కాలని, ఫడ్నవీస్‌ను అయిదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చూడాలనే పట్టుదలతో ఉంది. ఈ పరిణామాలు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ప్రతిష్ఠంభనకు దారి తీసింది.
దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది షిండే వర్గం. ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోకూడదని భావిస్తోంది. దీనికి ప్రతిగా తాము పెట్టిన డిమాండ్లను అంగీకరిస్తే తప్ప లొంగే ప్రసక్తే లేదనే సమాచారాన్ని బీజేపీ అధిష్ఠానానికి పంపించింది. దీనికి నిదర్శనమే- ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఎంపిక చేయడానికి ఏర్పాటు చేసిన మహాయుతి కూటమి భేటీ రద్దు కావడం. సొంత ఊరికి వెళ్లిన షిండే కోసం రాయబారాలు కొనసాగిస్తోంది బీజేపీ. బుజ్జగింపులు చేపట్టింది. అన్నింటినీ కాకపోయినా కొన్ని డిమాండ్లయినా ఒప్పుకోవడానికి పార్టీ అధిష్ఠానం సిద్ధంగా ఉందని మహారాష్ట్ర బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులె చెబుతున్నారు.
కాగా షిండే మొండి పట్టు పట్టట్లేదని, ఆయన అనారోగ్య కారణాల వల్ల మహాయుతి భేటీకి హాజరు కాలేదని శివసేన చెబుతోంది. కొంత విశ్రాంతి తీసుకోవాలనే కారణంతో సతారా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్లారని, ఒకటి రెండు రోజుల్లో ముంబైకి తిరిగి వస్తారని సంజయ్ శ్రీసత్ తెలిపారు. నేడో, రేపో కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయం రసవత్తరంగా సాగుతూ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos