దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. దీని తరువాత మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న పోలింగ్.

ఈ పరిస్థితుల్లో- రాజకీయంగా ఉత్కంఠతను రేకెత్తిస్తున్న వన్ నేషన్- వన్ ఎలక్షన్‌పై మరో కీలక ముందడుగు పడింది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ అయిదేళ్ల కాలంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను నిర్వహించబోతోన్నామనే సంకేతాలను పంపించింది.

గతంలో ఈ జమిలి ఎన్నికలను నిర్వహించడానికి గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సిఫాసుల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభకు ఒకేసారి పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలంటూ కేంద్రం ఆదేశాలను జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో- మద్రాస్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సంజీబ్ బెనర్జీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, రాజ్యసభ మాజీ సభ్యుడు గులాంనబీ ఆజాద్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ సీ కశ్యప్, మాజీ సీవీసీ సంజయ్ కొఠారి, సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వే సభ్యులుగా ఉన్నారు.

ఈ కమిటీ తన నివేదికను ఇప్పటికే కేంద్రానికి అందజేసింది కూడా. ఈ నివేదికను కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదం తెలిపింది. దేశ రాజధానిలో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం.. ఈ నివేదికపై క్షుణ్ణంగా చర్చించింది. దీనికి గల సాధ్యసాధ్యాలపై మోదీ ఆరా తీసింది. మంత్రలందరి అభిప్రాయాలను తీసుకున్నారు.

పూర్తిస్థాయిలో చర్చ అనంతరం ఈ ప్రతిపాదనలను మంత్రివర్గం యధాతథంగా ఆమోదించింది. త్వరలో ఏర్పాటు కాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. 2027లో ఏ క్షణంలోనైనా జమిలి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

Related Videos