ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ జీవనాడి పోలవరం పైన స్వయంగా సమీక్షకు నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు కేంద్రం భరిస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు కోసం నిధులు విడుదల చేసింది. కాగా, ప్రాజెక్టు నిర్మాణం పైన పొరుగు రాష్ట్రాల నుంచి కొన్ని సందేహాలు.. అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో.. ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై ప్రధాని మోదీ తొలిసారి సమీక్ష జరుపనున్నారు. ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఆంధ్ర, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డితో పాటు ఒడిశా, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రులు మోహన్ చరణ్, విష్ణుదేవ్ సాయి, ఆయా రాష్ట్రాల జల వనరుల మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ... ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు సమాచారాన్ని పంపారు.
ప్రధాని మోదీ 2014 లో గెలిచిన తరువాత పోలవరం కోసం ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసారు. ఆ తరువాత జరిగిన చర్చల ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత రాష్ట్రానికే అప్పగించాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. దీనికి కేంద్ర జలశక్తి శాఖ సానుకూలంగా స్పందించింది. దీంతో నిర్మాణ బాధ్యతలను 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షిస్తోంది. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అయితే, పోలవరం ప్రాజెక్టు నీటిని నిలుపుకోవడం ప్రారంభించిన తర్వాత గోదావరి నది బ్యాక్ వాటర్స్‌లో రాష్ట్రం మునిగిపోవడంపై తెలంగాణ ఆందోళనలు లేవనెత్తుతోంది.
పోలవరం పై కేంద్రానికి అందుతున్న అభ్యంతరాల పైన ప్రధాని సమీక్షించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తమ ఆందోళనలను జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం దృష్టికి గతంలో తీసుకెళ్లింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ కూడా ఇలాంటి ఆందోళనలను వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌లో భాగస్వామ్యులైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య పంచుకునే నీటితో గోదావరి నుండి 80 టిఎంసి అడుగుల నీటిని కృష్ణా నదికి మళ్లించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు నుండి తమ వాటాగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు 1.5 టిఎంసి అడుగులు, 5 టిఎంసి అడుగులు ఇవ్వాల్సి ఉంది. దీంతో, ఈ ప్రాజెక్టుల పైన నేరుగా సంబంధిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని సమీక్ష కీలకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos