ఏపీలో సీఎం చంద్రబాబు ప్రస్తుతం నివసిస్తున్న ఉండవల్లి కరకట్ట ఇంటి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కృష్ణానది ఎఫ్ టీఎల్ పరిధిని అతిక్రమించి ఈ ప్రైవేటు నిర్మాణం చేపట్టారంటూ గతంలో దీనిపై వివాదం తలెత్తింది. పారిశ్రామికవేత్త లింగమేనని రమేశ్ కు చెందిన ఈ నివాసం నిర్మాణంలో ఉల్లంఘనలు ఉన్నాయంటూ గతంలో వైసీపీ ప్రభుత్వం చర్యలకు దిగింది. దీంతో రమేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎంగా ఉన్న చంద్రబాబు నివసిస్తున్న ఉండవల్లి కరకట్ట ఇంటిని గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష నేతగా ఉండగా కూడా ఆయన అధికారిక నివాసంగా గుర్తించారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వాణీ మోహన్ ఉత్తర్వులు ఇచ్చారు. 2019 జూన్ 13 నుంచి 2024 జూన్ 11 మధ్య ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అధికారిక నివాసంగా దీన్ని గుర్తిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున తుది ఉత్తర్వులకు లోబడి ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు జీవోలో వెల్లడించారు.

గతంలో టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు ఉండవల్లిలోని కృష్ణానది కరకట్టపై ఉన్న ఈ ఇంటిని లింగమనేని రమేశ్ నుంచి తీసుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య లీజు ఉందా లేదా అనేది తెలియదు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు ఇంటి పక్కనే ఉన్న ప్రజా వేదికను  అప్పటి సీఎం జగన్ ఆదేశాలతో కూల్చేశారు. అనంతరం చంద్రబాబు ఇంటిని కూడా కూల్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో దీని యజమాని లింగమనేని రమేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే ఇచ్చింది. అదే సమయంలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఈ ఇంటిని అధికారిక నివాసంగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారులు .. చంద్రబాబు నివాసాన్ని అధికారిక నివాసంగా గుర్తింపు ఇచ్చారు.

Related Videos