ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఎమ్మెల్యే హోదాలో రఘురామ కృష్ణంరాజు చివరి ప్రసంగం చేశారు. డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికకు ముందు ఆయన వైజాగ్ లోని రుషికొండ భవనాలపై జరుగుతున్న చర్చలో కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు రుషికొండపై చర్యలు వద్దంటూ ప్రభుత్వానికి సలహా కూడా ఇచ్చారు. దీంతో షాక్ అవడం సభ్యుల వంతయింది.
రుషికొండపై ముఖ్యమంత్రి నివాస భవనం నిర్మించడానికి బయటకు తెలియకుండా డ్రామాలాడారని రఘురామ రాజు ఇవాళ అసెంబ్లీలో ఆరోపించారు. మొదట పర్యాటక భవనాల నిర్మాణాలు అంటూ చిత్రీకరించారన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి నివాసం కోసం అధికారుల పరిశీలనలో రుషికొండను గుర్తించినట్లు సినిమా స్టోరీ అల్లారని విమర్శించారు. వందల కోట్ల రూపాయలతో నిర్మించింది నివాస భవనం కాదు మాజీ ముఖ్యమంత్రి రాజకీయ సమాధి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
మాజీ సీఎం జగన్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం వల్లే తమ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారని రఘురామ గుర్తుచేశారు. గత ముఖ్యమంత్రి చేసిన తప్పులే తమకు వరంగా మారాయన్నారు. అందుకే రుషికొండ నిర్మాణాలపై చర్యలు తీసుకోవద్దన్నారు. రుషికొండ భవనాలను స్మారకంగా మార్చి ఎంతో కొంత ఎంట్రీ టికెట్ ధర పెట్టి పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా రఘురామ కోరారు.
కాగా రుషికొండ భవనంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ భవనంలో విలాస వస్తువులు చూస్తే.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందేనని అన్నారు. ఇలా భవనం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం తీరు చూస్తే ఏమనాలో కూడా తెలియడం లేదన్నారు. భవనంలో తలుపుల కోసం రూ.31 లక్షలు, బాత్‌రూమ్‌లో కమోడ్ కోసం రూ.11 లక్షలు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆ భవనంలో వాడిన ఖరీదైన ఫర్నిచర్ గతంలో తానెక్కడా చూడలేదన్నారు. రుషికొండపై జరిగిన అధికార దుర్వినియోగానికి జగన్‌ను జీవితాంతం జైలులో ఉంచినా తప్పులేదని.. పర్యాటకశాఖ భవనాల ముసుగులో నిర్మాణాలు చేసి అతిపెద్ద ఆర్థిక కుంభకోణం చేశారని అన్నారు. జగన్ సర్కార్ అధికార దుర్వినియోగంపై ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని ఆయన అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos