ప్రతి విషయంలోనూ అనాలోచితంగా నిర్ణయాలు తీసుకునే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి... ఇప్పుడు కూడా ఎలాంటి వివేకాన్ని ప్రదర్శించకుండా ఆత్రపడి మళ్లీ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీలో సుమారు 6 నెలల కిందట జరిగిన ఎన్నికల్లో వైసీపీని తిరస్కరించిన ప్రజలు... ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే ఇచ్చి జగన్ కు బుద్ధి చెప్పారు. గత ఐదేళ్ల వైసీపీ పరిపాలనకు నెగిటివ్ గా తీర్పు ఇచ్చి కూటమి పార్టీలకు 164 సీట్లలో గెలుపును కట్టబెట్టారు. ఎన్నికల్లో దారుణ ఓటమిని అవమానంగా భావించిన జగన్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా బహిష్కరించి... ఇప్పుడు తగుదునమ్మ అంటూ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల వద్ద రైతులు... ధర్నాలు, ఆందోళనలు చేయాలని, అదేవిధంగా విద్యుత్ చార్జీల పైన ఈ నెల 27న ఆందోళన చేపట్టాలని ప్రజలకు, జనవరి 3వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆందోళనలు చేపట్టాలని విద్యార్థులకు వైసీపీ అధినేత జగన్ పిలుపునివ్వడాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని భావించవచ్చు. కానీ వచ్చే సంక్రాంతి తర్వాత జగన్ 26 జిల్లాల పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకోవడమే ఆశ్చర్యంగా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్ని చుట్టేయబోతున్నారని, వారానికి రెండు రోజుల పాటు ఒక్కో జిల్లాలో పర్యటిస్తూ అక్కడే బస చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది.
సుమారు ఆరు నెలల కిందటే ఎన్నికల ఫలితాల్లో ప్రజాభిప్రాయం ఏమిటో తెలిసినా .. మళ్లీ ఇప్పుడు ఎందుకు జనాల్లోకి వెళ్లాలనుకుంటున్నారంటే ... జగన్ కు జమిలీ ఎన్నికల భయం పట్టుకుందని పరిశీలకులు అంటున్నారు. అందుకే జగన్ ప్రతి సమావేశంలోనూ పార్టీ నేతలకు .. ఎన్నికలకు సిద్ధం కావాల్సిన తరుణం వచ్చేసిందని పదే పదే చెప్తున్నారు. దీంతో జగన్ జిల్లాల టూర్ ఆసక్తి రేపుతోందని అంటున్నారు. ఆరునెలల కిందటే తమ తీర్పు స్పష్టంగా చెప్పేసిన ప్రజలు... జగన్ ను ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న చర్చ కూడా మొదలైంది. ఇంతకీ జగన్ ఇంత త్వరగా జనంలోకి వెళ్లాలని ఎందుకు నిర్ణయించుకున్నారని దానిపై చర్చ జరుగుతోంది.
మరోవైపు కేంద్రంలోని ఎన్డీయేతో పాటు విపక్ష ఇండియా కూటమిని కూడా జనం దాదాపు సమానంగానే ఆదరిస్తున్నారు.ఈ నేపథ్యంలో పరిస్ధితి చేజారకముందే ప్రధాని మోదీ జమిలికి వెళ్లిపోతే ఇబ్బందులు తప్పవన్న ఆలోచనతోనే జగన్ ఇలా ముందస్తుగా జనంలోకి వెళ్లిపోతున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటి నుంచి ప్రతిరోజూ ప్రజల్లోనే ఉంటూ వరుసగా ఆందోళనలు చేపడుతూ ప్రభుత్వాన్ని ఒత్తిడిలోకి నెట్టడం ప్రారంభిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయన్న ఆలోచనతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos