వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎట్టకేలకు నాలుగో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యధికంగా ఎస్సీ రిజర్వుడు స్థానాల్లోని ఇన్ చార్జీలను మార్చింది. నాలుగో జాబితాలో ఎస్సీ రిజర్వుడులో ఏకంగా 1 ఎంపీ 7 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. తాజాగా ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం నిరాకరించింది. సీట్లు కోల్పోయిన వారిలో నలుగురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. శింగనమల, నందికొట్కూరు, తిరువూరు, మడకసిర, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి మొండిచేయి చూపించింది. శింగనమల ఎస్సీ రిజర్వుడు సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతికి వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చేందుకు అధిష్టానం నిరాకరించింది. శింగనమల అసెంబ్లీ సమన్వయ కర్తగా ఎం.వీరాంజనేయులను నియమించింది. అదేవిధంగా నందికొట్కారు ఎస్సీ రిజర్వుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ పోలీస్ ఉన్నతాధికారి తోగురు అర్థర్‌కు వచ్చే ఎన్నికల్లో సీటు నిరాకరించిన జగన్.. నందికొట్కూరు అసెంబ్లీ సమన్వయకర్తగా డాక్టర్ దారా.సుధీర్‌ను ప్రకటించారు. తిరువూరు ఎస్సీ రిజర్వుడు సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధికి వచ్చే ఎన్నికల్లో సీటు నిరాకరిస్తూ.. ఆ నియోజకవర్గం అసెంబ్లీ సమన్వయకర్తగా నల్లగట్ల స్వామిదాస్‌ను నియమించారు. మడకసిర ఎస్సీ రిజర్వుడు సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామికి ఈ సారి సీటు ఇవ్వలేదు. ఆ నియోజకవర్గం ఇంచార్జిగా ఈర లక్కప్పను నియమించారు. కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూధన యాదవ్‌కు కూడా ఈసారి సీటు ఇవ్వలేదు. కనిగిరి అసెంబ్లీ ఇంచార్జిగా దద్దాల నారాయణ యాదవ్‌ను నియమించారు. అదేవిధంగా గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం జి.నారాయణ స్వామికి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి జలక్ ఇచ్చారు. నారాయణ స్వామికి స్థానచలనం కలిగిస్తూ.. చిత్తూరు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. చిత్తూరు సిట్టింగ్ ఎంపీ ఎన్. రెడ్డప్పను జీ.డి. నెల్లూరు అసెంబ్లీ ఇంచార్జిగా నియమించారు. హోం మంత్రి తానేటి వనితను కొవ్వూరు ఎస్సీ స్థానం నుంచి గోపాలపురం ఎస్సీ స్థానానికి బదిలీ చేశారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావును కొవ్వూరు ఇన్‌చార్జిగా నియమించారు. మొత్తానికి వైసీపీ అధిష్టానం నాలుగో జాబితాలో ఎస్సీ క్యాండిడేట్స్ కు షాక్ ఇచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos