అత్యంత వివాదాస్పదమైన ఢిల్లీ సర్వీసుల బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లుపై ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా ఆమోదముద్ర వేయడంతో... ఇక ఢిల్లీ సర్వీసుల చట్టం గా అమల్లోకి వచ్చినట్లయింది. ఆగస్టు 1వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేషనల్ కేపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఢిల్లీలోని పాలనా వ్యవహారాలపై కేంద్రానికి అధికారాలు కల్పించే బిల్లు ఇది. ఆప్ సహా పలు పార్టీలు దీన్ని వ్యతిరేకించినప్పటికీ బిల్లు ప్రవేశపెట్టారు అమిత్ షా. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పూర్తవడం వల్ల చట్టంగా మారిపోయింది. ఆగస్టు 7న రాజ్యసభలో ఈ బిల్లు పాస్ అయింది. 132 ఓట్లు అనుకూలంగా రాగా...102 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. వైసీపీ, బీజేడీ పార్టీలు కేంద్రానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఈ బిల్లు ప్రజాస్వామ్య విధానానికే వ్యతిరేకం అని ఆప్ విమర్శించింది. పాలనా వ్యవహారాల్లో కేంద్రం జోక్యం ఉండకూడదని నిరసిస్తున్న ఆప్ వైఖరికి వ్యతిరేకంగా బిల్లు తీసుకొచ్చింది కేంద్రం. ఢిల్లీలోని అధికారులను బదిలీ చేయాలన్నా, తొలగించాలన్నా అంతా కేంద్రం అధీనంలోనే ఉంటుంది. దీన్ని చాలా సందర్భాల్లో వ్యతిరేకించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. సీఎం పదవి ఉన్నా...అధికారులు తాము చెప్పినట్టుగా నడుచుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలోనే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సక్సేనాతోనూ విభేదాలు వచ్చాయి. దీనిపై ఆప్ న్యాయపోరాటం కూడా చేసి విజయం సాధించింది. ఢిల్లీలో ఐఏఎస్ లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని ఈ ఏడాది మే నెలలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పు వచ్చిన మరుసటి రోజే ఢిల్లీలో అధికారుల బదిలీలపై కేంద్రం ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గ్రూప్ ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలపై నిర్ణయాలు తీసుకోవడానికి జాతీయ రాజధాని సివిల్ సర్వీస్ ఆథారిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి ఢిల్లీ ముఖ్యమంత్రి చైర్మన్ గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోం కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఇందులో సీఎం మినహా మిగిలిన ఇద్దరు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటారు. మెజారిటీ సభ్యుల నిర్ణయ ప్రకారం ఉద్యోగుల బదిలీలు, నియామకాలు జరుగుతాయని ఆర్డినెన్స్ స్పష్టం చేసింది. ఒకవేళ వీరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే లెఫ్ట్ నెంట్ గవర్నర్ దే తుది నిర్ణయమని పేర్కొంది. అంటే, అధికారమంతా కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. దీంతో ఈ ఆర్డినెన్స్ పై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. తాజాగా రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు కాస్త చట్టంగా మారింది. కాగా... ఢిల్లీలో అవినీతి రహిత పాలనను అందించాలన్న లక్ష్యంతోనే సర్వీసుల బిల్లును తెచ్చామన్నారు అమిత్ షా. మాపై విమర్శలు చేయడం కాదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ బిల్లును తొలిసారిగా తీసుకొచ్చారని ఆయన గుర్తుచేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos