ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యలు, పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా చంద్రబాబు అలర్జీ బారిన పడ్డారు. దీనిపై స్పందించిన జైలు అధికారులు వెంటనే.. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం అందించగా... వైద్యబృందం హుటాహుటిన జైలుకు వెళ్లి చంద్రబాబును పరీక్షించారు.
అనంతరం వైద్యులు గురువారం రాత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. చంద్రబాబు చర్మ సంబంధిత అస్వస్థతకు గురయ్యారని, వైద్యులు పరీక్షలు చేసి మందులను సూచించారని, ఆ మందులను చంద్రబాబుకు అందించామని ... చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారని.. ఎటువంటి భయాందోళనలు, అపోహలకు గురికావద్దని జైలు అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా ఎండ తీవ్రతగా ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు ఇటీవల ఒక్కసారిగా డీహైడ్రేషన్ కు గురైన విషయం తెలిసిందే. తాజాగా చర్మ సంబంధిత అస్వస్థతకు గురి కావడం గమనార్హం. మరోవైపు.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు డీహైడ్రేషన్ కు గురైనట్లు చెప్పినప్పుడే .. ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదని మొదట్నుంచీ చంద్రబాబును ఇబ్బంది పెట్టేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని కుటుంబసభ్యులు మండిపడ్డారు. జైల్లో వసతులు కల్పించకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీ సౌకర్యం లేకపోవడంతో ఎండ తీవ్రతకు చంద్రబాబు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలావుండగా... ఏపీ ఫైబర్ నెట్ కేసులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారంట్‌ను ఏసీబీ కోర్టు గురువారం ఆమోదించింది. ఈ నెల 16న చంద్రబాబును వ్యక్తిగతంగా కోర్టులో హాజరు పర్చాలని జడ్జి ఆదేశించారు. ఈరోజు చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తే జోక్యం చేసుకోవచ్చని చంద్రబాబు తరపు న్యాయవాదులకు ఏసీబీ కోర్టు సూచించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos