టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ... విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా ఈ రోజు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించనున్న క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ... జైల్లో చంద్రబాబును ఉంచడం అత్యంత ప్రమాదకరమని చెప్పారు. గతంలో పశ్చిమబెంగాల్ మంత్రుల విషయంలో జరిగిన ఉదంతాలను కోర్టులో ప్రస్తావిస్తామని తెలిపారు. హౌస్ అరెస్ట్ పిటిషన్ పై వాదనలు వినిపిస్తామని చెప్పారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో విజయవాడకు వంద కి.మీ. దూరంలో ఉంచాలని, అంతకంటే ఎక్కువ దూరం తీసుకువెళితే ప్రమాదమని సిద్దార్థ లూథ్రా పేర్కొన్నారు. దీనిపై కోర్టులో పిటిషన్ వేస్తామని, వాదనలు గట్టిగా వినిపిస్తామని చెప్పారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ప్రపంచం మొత్తానికి తెలుసునని, ఆయనను జైల్లో ఉంచడం సరికాదని అన్నారు. బెయిల్ పిటిషన్ కంటే ముందు హౌస్ అరెస్టు పిటిషన్‌పై ఎక్కువదృష్టి పెడుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘకాలం సేవలందించిన నేపథ్యంలో ఆయనకు శత్రువులు, మిత్రులు అదేస్థాయిలో ఉంటారని లూథ్రా వ్యాఖ్యానించారు.లూథ్రా వ్యాఖ్యాలను న్యాయస్థానం ఏవిధంగా పరిగణస్తుందనేది ఉత్కంఠగా మారింది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో మరి చూడాలి.
ఇదిలావుండగా... స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై జైల్లో ఉన్నచంద్రబాబుకు ఏపీ సీఐడీ మరో షాక్ ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో విచారణకు కోర్టులో పిటిషన్ వేసింది. 2022లో నమోదైన ఈ కేసులో విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ వచ్చిన వెంటనే ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో అరెస్టు చేసేందుకు సిఐడీ సిద్ధమవుతోంది. అందుకే కోర్టులో పిటిషన్ మూవ్ చేసింది. కేవలం కాగితాలకే పరిమితం చేసి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పేరుతో దోపిడీ చేశారని 2022లో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. అలైన్‌మెంట్‌ను నచ్చినట్టు మార్చేశారని ఆరోపిస్తోంది. చంద్రబాబు టీంలో మంత్రిగా ఉన్న నారాయణ ఈ అవినీతిలో భాగమై ఉన్నారని కూడా చెబుతోంది ప్రభుత్వం. ఆ అవినీతిలో భాగంగానే లింగమనేని రమేష్‌తో కుమ్మక్కై ఆయన భవనంపై ఉంటున్నారని వైసీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వస్తోంది. మొదట 94 కిలోమీటర్లకే ఇన్నర్ రింగ్ రోడ్డును పరిమితం చేసిన అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అలైన్‌మెంట్ మార్చారని ఆరోపిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో ఈ కేసును విచారించిన సీఐడీ ఏ-1గా చంద్రబాబును, ఏ-2గా నారాయణను, ఏ-3గా లింగమనేని రమేశ్‌ను, ఏ -6గా నారా లోకేష్‌ను ఉంచింది. ఇప్పుడు ఈ కేసునే తెరపైకి తీసుకొచ్చి చంద్రబాబును అష్టదిగ్బంధం చేయాలని చూస్తోంది. చంద్రబాబుకు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ వస్తే వెంటనే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అరెస్టు చేసేందుకు ప్లాన్ చేశారు. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos