స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసినప్పటి నుంచి ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. తాజాగా... చంద్రబాబుకు వ్యతిరేకంగా న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చిన క్రమంలో... ఆయన్ను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఉదయమే చంద్రబాబుకు ప్రత్యేక వైద్యబృందం మెడికల్ టెస్టులు చేసింది. అల్పాహారాన్ని తీసుకున్న చంద్రబాబు మెడిసిన్స్ వేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు సరిగ్గా ఉదయం 9.30 గంటలకు ఆయనను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని, విచారణను ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ బ్రేక్ ఇస్తారు. 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. ప్రతి గంటకూ చంద్రబాబుకు 5 నిమిషాల పాటు బ్రేక్ ఇస్తారు. సీఐడీ విచారణ నేపథ్యంలో జైలు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. జైలు పరిసరాల్లో రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సీఐడీ డీఎస్పీ ఎం.ధనుంజయుడు నేతృత్వంలో 12 మంది సీఐడీ అధికారులు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. సీఐడీ... దాదాపు 30 ప్రశ్నలకు సమాధానం రాబట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును విచారించేందుకు సీఐడీ తరపున 12 మందికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. తొమ్మిదిమంది విచారణ అధికారులు, ఇద్దరు మధ్యవర్తులు, ఒక వీడియోగ్రాఫర్ ఉంటారని పేర్కొంది. చంద్రబాబు తరపున ఇద్దరు న్యాయవాదులు గింజుపల్లి సుబ్బారావు, దొమ్మాలపాటి శ్రీనివాస్ పాల్గొనడానికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చిన సమయంలో విచారించారు. ఆ సమయంలో చంద్రబాబు తమకు సహకరించలేదనేది సీఐడీ అధికారుల వాదన. దీంతో, ఇప్పుడు కొత్త వ్యూహంతో ప్రశ్నలు సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో బాబుపై 34 అభియోగాలు మోపిన సీఐడీ ... గతంలో చంద్రబాబు సర్కార్ తప్పుడు పత్రాలు సృష్టించటం, నిధుల మళ్లింపు, సీమన్స్ తో ఒప్పందం... ఈ మేరకు జారీ చేసిన జీవోతో పాటుగా, డాక్యుమెంట్స్, ఫోర్జరీ, 13 నోట్ ఫైల్స్‌పై బాబు సంతకాలు, ఐటీని లెక్కచేయకపోవటం, షెల్ కంపెనీలు, అధికారులపై ఒత్తిడి లాంటి కీలక అంశాలపై ప్రశ్నలు సంధించనున్నట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ అప్రూవల్ లేకపోవడంపైనా... నిధుల విడుదలపై ఫైనాన్స్ శాఖ అధికారులు వద్దన్నా ... చంద్రబాబు ఎందుకు వందల కోట్లు విడుదల చేయించారనే విషయంపైనా సీఐడీ ప్రశ్నలు సిద్ధం చేసిందని సమాచారం. ఈ విచారణలో చంద్రబాబు వెల్లడించే అంశాలు మొత్తంగా కీలకం కానున్నాయి. ఇదే సమయంలో చంద్రబాబు విచారణకు సహకరిస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos