నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇక కొన్ని గంటల్లో షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ అయిదు రాష్ట్రాల్లో నవంబర్, డిసెంబర్‌లో పోలింగ్ జరగవచ్చని, డిసెంబర్ రెండో వారంలో ఓట్ల లెక్కింపు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా... ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది.
తెలంగాణతో పాటుగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ గడువు జనవరి 23తో ముగియనుంది. మిజోరం గడువు డిసెంబర్ 17వ తేదీతో పూర్తి కానుంది. ఈ నిర్దిష్ఠ గడువులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. 2018లో పైన పేర్కొన్న ఐదు రాష్ట్రాల్లోని నాలుగింటిలో ఎన్నికలు ఒకే దశలో జరిగాయి. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న చత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు దశల్లో జరిగాయి. షెడ్యూల్ ప్రకటన తర్వాత ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల వేడి రాజుకోనుంది. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్-బీజేపీ నేరుగా తలపడనున్నాయి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ జరగనుంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరగనున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కన్నేసిన బీజేపీ అధికారంలోకి రావడమే పరమావధిగా పావులు కదుపుతోంది.
మరోవైపు, కేంద్రంలో తిరుగులేని శక్తిగా మారిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. మొత్తం 25 పార్టీలతో కలిసి ఏర్పడిన ఈ కూటమి బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. అయితే, ఇండియా కూటమి తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ఇప్పటి వరకు ప్రకటించలేదు. అంతేకాదు, ఇందులోని పార్టీలు ఆయా రాష్ట్రాల్లోని శాసనసభ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగనున్నాయి. తెలంగాణలో తమ గెలుపు ఖాయమని కాంగ్రెస్, బీజేపీ చెబుతున్నాయి. ఇప్పుడు షెడ్యూల్ విడుదల కానుండటంతో...ఇక రాజకీయ సమరానికి పార్టీలు సై అంటున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos