విశాఖలోని గాజువాకలో గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీయడంతో యాజమాన్యం చర్చలకు పిలిచింది. జిల్లా అధికారుల సమక్షంలో జరిగిన చర్చల్లో కొన్ని కీలకమైన డిమాండ్ల పరిష్కారానికి యాజమాన్యం అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఈ ఆందోళనల నేపథ్యం గురించి కాస్త తెలుసుకుందాం. పోర్టు వద్ద 45 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న కార్మికులు ... ఇక చేసేది లేక... పోర్టు బంద్‌కు పిలుపునివ్వడమే కాకుండా పోర్టు ముట్టడికి యత్నించారు. ఈ ఆందోళనకు కార్మికుల కుటుంబాలు, వివిధ రాజకీయ పార్టీలు సైతం కదలివచ్చాయి. ఈ బంద్ పిలుపుతో ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా కార్మికులు వెనక్కి తగ్గలేదు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేట్లు, ముళ్ల కంచెలను దాటుకొని దూసుకెళ్లారు. ఈ ఉద్రిక్తతలో పోలీసులకు గాయాలు అయ్యాయి. కార్మికులు కూడా గాయపడ్డారు. కొందరు స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా గంగవరం పోర్టు యాజమాన్యంతో అధికారులు చర్చలు జరిపారు.
కార్మికులకు 24 వేల నుంచి 36 వేల రూపాయల వరకు కనీస జీతం ఇవ్వాలనేది మొదటి నుంచి వారు చేస్తున్న డిమాండ్. దీనికి యాజమాన్యం ఒప్పుకోలేదు. అయితే దీనికి బదులు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద ప్రతి కార్మికుడికి పదివేల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించింది. దీనికితోడు ఇంక్రిమెంట్ ఇచ్చేటప్పుడు అదనంగా వెయ్యి రూపాయలు ఇవ్వడానికి అంగీకరించింది. గతంలోనే ఈ ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ ప్రస్తావించారు. అయితే కార్మికులు దీనికి ఒప్పుకోలేదు. ఇప్పుడు మళ్లీ అదే ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. కార్మికులు డిమాండ్ చేస్తున్నట్లు సమాన పనికి సమాన వేతనం అంశం చర్చకు రాలేదని ఆర్డీవో చెప్పారు. ఇప్పటికైనా కార్మికులు శాంతించి ఇవాళ్టి నుంచి విధులకు హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యాజమాన్యంతో సంబంధం లేకుండా ప్రభుత్వం గ్యారెంటీతో బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు కూడా అధికారులు ఓకే చెప్పారు. ఇప్పుడు ... కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరతారా లేదా అనేది హండ్రెడ్ డాలర్ల క్వొశ్చన్ గా మిగిలిఉంది.
ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos