టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టు తాజాగా ఆంక్షలు విధించింది. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఇదివరకే ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా... ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. దీని పైన విచారించిన సుప్రీం ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో చంద్రబాబుకు తాజాగా కండీషన్లు విధించింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 11వ తేదీకి వాయిదా వేస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు వెలువరించిన తీర్పు మేరకు చంద్రబాబు రేపటి నుంచి స్వేచ్ఛగా రాజకీయ కార్యకలాపాల తో పాటుగా అన్నింటా పాల్గొనవచ్చు. ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు హాజరు కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో హైకోర్టు విధించిన కండీషన్లు కొనసాగుతాయని స్పష్టం చేసింది. స్కిల్ కేసు గురించి బయట చంద్రబాబు ప్రకటనలు చేయటానికి వీల్లేదని పేర్కొంది. అదేవిధంగా కేసు వివరాల పైన బహిరంగంగా ప్రకటనలు చేయవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే హైకోర్టు నుంచి బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ నుంచి చంద్రబాబు వరుస పర్యటనలు ఖరారు చేసుకున్నారు. తిరుమల, శ్రీశైలంతో సహా పుణ్యక్షేత్రాల సందర్శన... అనంతరం రాజకీయ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఇక, ఇప్పుడు న్యాయస్థానం గతంలో హైకోర్టు విధించిన కండీషన్లు కొనసాగుతాయని స్పష్టం చేయటంతో..చంద్రబాబు రాజకీయ పర్యటనకు బ్రేక్ పడినట్లు అవుతోంది. ఇక, సీఐడీ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ లో చంద్రబాబుకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 11న ఈ కేసు మరోసారి విచారణకు రానుంది. ఇక..ఇదే స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన విచారణ పూర్తయింది. తీర్పు వెల్లడి కావాల్సింది. చంద్రబాబు పైన కేసుల్లో మొత్తంగా ఈ తీర్పు కీలకం కానుంది.
ఇదిలావుండగా... 2021 డిసెంబర్ 9న స్కిల్ కేసు నమోదు చేశారు. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ 37గా సీఐడీ చేర్చింది. 17ఏ వర్తింపుపై చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ అత్యంత కీలకంగా మారింది. ఆ పిటిషన్ పై వచ్చే తీర్పును బట్టే చంద్రబాబుపై కేసుల అంశం తేలే అవకాశం ఉంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos