ప్రభుత్వాలు సమస్యలు పరిష్కరించనప్పుడు.... లేదా ప్రభుత్వాల నుంచి ఏదైనా సమస్యలు క్రియేట్ అయినప్పుడు... సాధారణంగా మనం ... సంబంధిత అధికారుల, లేదా కార్యాలయాల ఎదుట ధర్నాలు, ఆందోళనలు చేయడం ఆనవాయితీ. కానీ ... ఇక్కడ ఒక యువకుడు మాత్రం వినూత్నంగా నిరసన తెలిపి అధికారులను బెంబేలెత్తించాడు. అదేమిటో కాస్త చూద్దాం. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ అంతా అల్లకల్లోలంగా ఉంది. జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లోకి భారీగా నీరు వచ్చి... డ్రైనేజీలు పొంగిపొర్లడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునుగుతున్నాయి.
కొన్ని ఇండ్లలోకి విష సర్పాలు సైతం వస్తున్నాయి. ఈ క్రమంలో నగరంలోని అల్వాల్ ప్రాంతంలో ఓ ఇంట్లోకి పాము రావడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. వారు వెంటనే ఫోన్ ద్వారా జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసి కొన్ని గంటలు గడిచినా... జీహెచ్ఎంసీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఆ కుటుంబంలోని సంపత్ అనే యువకుడికి కోపం వచ్చింది. తీవ్ర ఆగ్రహానికి గురైన సంపత్ ... అధికారుల ఎదుట తన నిరసనను వినూత్న రీతిలో వ్యక్తం చేశాడు. తన ఇంట్లోకి వచ్చిన పామును తీసుకుని ఆల్వాల్ జీహెచ్ఎంసీకి చేరుకున్నాడు. నేరుగా కార్యాలయంలోకి వెళ్లి... అధికారుల ఎదుట ఉన్న టేబుల్ మీద పామును విడిచిపెట్టి వినూత్న నిరసనకు దిగాడు. దీంతో కార్యాలయ సిబ్బంది, అధికారులు షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన నెటిజన్స్ ... వీడు మాములోడు కాదు బాబాయ్.. పాముతో భలే నిరసన అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పాముతో నిరసన ... భలేగ ఉంది కదూ అంటూ సామాన్య జనాలు కూడా తెగ నవ్వుకుంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos