హైదరాబాద్ నగరాన్ని భారీవర్షం కుదిపేస్తోంది. వర్షం తీవ్రస్థాయికి చేరి కుండపోతకు మించి కురుస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో కురుస్తున్న వర్షాలతో నగర వాసులు వణికిపోతున్నారు. ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చింది. హైదరాబాద్ కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తం అయింది. డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. భారీ వర్షాలు తప్పవనే తాజా హెచ్చరికలతో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఐటీ క్యారిడార్ లో రెండు రోజులపాటు ఆఫీసు వేళలు మార్చుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా.. ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఒకేసారి బయటికి రాకుండా వేర్వేరు లాగౌట్ సమయాలను ప్రకటించారు. నగరంలోని చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్ల పరిధిలో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆయా జోన్లలో గంటకు 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు, కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే.. గంటకు 10 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మరోవైపు హుస్సేన్సాగర్ గరిష్ఠ నీటిమట్టానికి చేరుకుంది. హైదరాబాద్ జంట జలాశయాల్లో వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది. దీంతో హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మూసీ నది పొంగి పొర్లుతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. భారీ వర్షం కారణంగా చెట్లు కూలుతాయని, విద్యుత్ స్తంభాలు దెబ్బతిని కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇక... ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ... ఏపీలో కూడా మరో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు చెబుతున్నారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నట్లు వివరించారు. ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, గొర్రెల కాపరులతో పాటు రహదారులపై వాహనాల్లో ప్రయాణించే వారు .. చెట్ల కింద ఉండరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. సో... మరో రెండు లేదా మూడురోజుల పాటు తెలుగురాష్ట్రాలకు భారీవర్షాల ముప్పు తప్పదని తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos