మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. నర్సాపురానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైందని ఆయన బంధువులు చెబుతున్నారు. తన మిత్రుడి బంధువుల అమ్మాయినే వంగవీటి రాధ వివాహమాడబోతున్నారని పేర్కొంటున్నారు. ఇప్పటివరకు పలు సందర్భాల్లో వివాహం గురించి వంగవీటి రాధను ప్రశ్నించగా... ఆయన నుంచి చిరునవ్వే సమాధానంగా ఉండేది. ఇప్పుడు ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేళ... రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్న రాధా, ఇప్పుడు ఆకస్మికంగా వివాహ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ కుటుంబానికి చెందిన యువతినే రాధా వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. ఈ నెల 19న నర్సాపురంలో నిశ్చితార్థం, సెప్టెంబర్‌లో వివాహమని బంధువుల సమాచారం. నరసాపురం మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ కుమార్తెతో రాధా వివాహం జరగనుందని అనుచరులు చెబుతున్నారు. రాజకీయంగానూ కీలక నిర్ణయం దిశగా రాధా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని రాధా భావిస్తున్నారు. అక్కడ టీడీపీ నుంచి బోండా ఉమ సీటు ఆశిస్తున్నారు. జనసేనలో చేరినా సెంట్రల్ సీటు దక్కుతుందా అనేది అనమానంగానే కనిపిస్తోంది. దీంతో, రాధా టీడీపీలో కొనసాగుతారా లేక ప్రచారం సాగుతున్నట్లుగా జనసేనలో చేరుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. వంగవీటి రంగ కుమారుడిగా వంగవీటి రాధాకు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. వంగవీటి రాధా 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం టీడీపీలో ఉంటున్న వంగవీటి రాధా ... కొంతకాలం పాటు రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవలి కాలంలో తిరిగి యాక్టివ్ అయ్యారు. అయితే రాధా పెళ్లి గురించి ఆయన అభిమానులు ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పెళ్లికి చేసుకోబోతున్నారనే వార్త వినిపించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక, రాధా ... వివాహానికి అభిమానులను అందరినీ ఆహ్వానించి గ్రాండ్‌గా చేస్తారా... లేదా కుటుంబసభ్యుల సమక్షంలో సింపుల్ గా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. తన వివాహం గురించి వంగవీటి రాధా అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు వంగవీటి అభిమానుల్లో సంతోషం కనిపిస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos