ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో... ఈ నాలుగేళ్లలో సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎక్కడో ... ఏదో లోటు కనిపిస్తోందని ... పార్టీ నాయకత్వం భావించింది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు గడప గడపకూ ప్రభుత్వం పేరుతో తాము చేసిన పనుల్ని ... ప్రజల్లోకి తీసుకెళ్లినా వాటిపైనా అక్కడక్కడా ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో కొత్త కార్యక్రమం చేపట్టబోతున్నట్లు వైసీపీ ఎమ్మెల్యేల భేటీలో సీఎం జగన్ సంకేతం ఇచ్చారు. జులై 1 నుంచి ప్రారంభం కాబోతున్న జగనన్న సురక్ష కార్యక్రమం ముగిసిన తర్వాత దీన్ని ప్రారంభించబోతున్నారు.
జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకూ అర్హులై ఉండి కూడా సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి వారికి వాటిని అందజేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ... ‘‘వై ఏపీ నీడ్స్ జగన్ ’’.. పేరుతో సరికొత్త కార్యక్రమం చేపట్టాలని సీఎం జగన్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇప్పటివరకూ తాము చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఏపీకి జగన్ అసలు ఎందుకు అవసరం అనే పేరుతో మరో రూపంలో ప్రజల్లోకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా సరేకానీ... జగన్ ఈ నాలుగేళ్లలో ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా... ఎందుకు ఆయనపై ప్రజలకు నమ్మకం కుదరడం లేదన్నది చర్చనీయాంశం.
ప్రతీ ఇంటికి మేలు చేశాము కాబట్టి... మళ్ళీ మనకే ఓట్లు వేయాలని గట్టిగా అడగమని జగన్ ... ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే జగన్ నమ్ముతున్న ఈ సంక్షేమ సిద్ధాంతాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తిగా నమ్మడం లేదని తెలుస్తోంది. గడప గడపకి కార్యక్రమంలో వారు ఎదుర్కొంటున్న చేదు అనుభవాలతో ప్రజలు ... వైసీపీ ప్రభుత్వం, పాలన, సంక్షేమ పథకాల గురించి ఏమనుకొంటున్నారో వారికి బాగానే అర్థమైంది.
అందుకే... సీఎం జగన్ ఎంతగా ఒత్తిడి చేస్తున్నప్పటికీ వైసీపీ నేతలు గడప గడపకి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదని అంటున్నారు. ఏపీలో ఈ నాలుగేళ్ళ వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలు తప్పితే ... ఒక్క అభివృద్ధి పని కూడా జరుగలేదని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధి జరిగి ఉంటే, వైసీపీ నేతలు ఇంతగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించే చెప్పుకొనేవారు. అప్పుడు 175 సీట్లు మాకే ఇవ్వాలని అడిగినా అర్థం ఉండేది. ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా... ఇప్పుడు మళ్లీ మాదే ప్రభుత్వమని చెప్పుకుంటుంటే... దాన్ని నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఇవన్నీ గ్రహించిన సీఎం జగన్... ఇప్పుడు కొత్తగా... వై ఏపీ నీడ్స్ జగన్ ’ అని మభ్యపెట్టే మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఏపీలో ఏం జరుగుతుందో చూడాలిమరి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos