తెలంగాణలో ఎప్పటికప్పుడు రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటుండటంతో ఆయా పార్టీల క్యాడర్ లోనే అయోమయ పరిస్థితి నెలకొంది. నిన్నటిమొన్నటి వరకు ఉప్పూనిప్పులాగా ఉన్న బీఆర్ఎస్ – బీజేపీ పార్టీల నేతలు ... గత కొంతకాలం నుంచి ఎందుకోమరి ఎవరి రాజకీయాలు వారు ప్రశాంతంగా చేసుకుంటున్నారు. ప్రధాని మోడీపై ప్రతి అంశంపైనా ఒంటి కాలిపై లేచే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు ఎలాంటి విమర్శలు చేయకపోగా ... కామ్ గోయింగ్ విధానంలో ఏ విషయాన్నీ పట్టించుకోవడం లేదు.
మద్యం కుంభకోణం కేసులో... బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తన కూతురు అయిన కల్వకుంట్ల కవిత చిక్కుకుపోవడమే కేసీఆర్ మౌనానికి కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో... జాతీయ స్థాయి బీజేపీ నేతలు కూడా కేసీఆర్ ను పట్టించుకోవడం మానేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం విషయంలో రాష్ట్ర బీజేపీ కూడా ... ఓ అడుగు వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తోందని అంటున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని అధికారికంగా ప్రకటించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆ ప్రణాళికలను విరమించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మేరకు ఢిల్లీ నేతల నుంచి సిగ్నల్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు కౌంటర్‌గా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. 21 రోజుల పాటు అధికార బీఆర్ఎస్‌పై ప్రతికూల ప్రచారం, నిరసనలు చేపట్టి... కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎదురుదాడి చేయాలని ప్రణాళికలు రచించింది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ నాయకులు షెడ్యూల్ కూడా విడుదల చేశారు.
అయితే ఇప్పుడు బీజేపీ హైకమాండ్ సూచనలతో ఈ ప్రణాళికపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం వెనక్కి తగ్గినట్టుగా సమాచారం. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతికూల ప్రచారం వద్దని హైకమాండ్ సూచించినట్లుగా సమాచారం. ఇందాకా మనం అనుకున్నట్లు... తెలంగాణలో ... ఎట్టి పరిస్థితుల్లోనూ.. అధికారం చేపట్టి తీరాల్సిందేనని పట్టుబట్టిన బీజేపీ.. ఆమధ్య కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కుటుంబ పాలన, అవినీతికి కేరాఫ్ అడ్రస్ అంటూ విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ పాత్ర ఉందని.. కవిత అరెస్ట్ అవడం ఖాయమని కూడా చెప్పుకొచ్చారు. కానీ అలా జరగలేదు.
మరోవైపు... ఇదంతా గమనిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీల పైన తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు లాలూచీ పడ్డాయని ఆ పార్టీ నేతలు విమర్శల దాడి చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నిరసన కార్యక్రమాలను ప్రకటించిన తరువాత.. ఇప్పుడు .. ఆ పార్టీ ఎందుకు వెనక్కి తగ్గిందనేది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ వ్యూహమేమిటోనని రాజకీయ పరిశీలకులు సైతం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు ఏ పార్టీల కదలికలు ఎలా ఉంటాయో చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos