తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రేపటినుంచి అంటే 8వతేదీ నుంచి మూడు రోజుల పాటు ఫిష్ ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు పసందైన చేపల వంటకాలు ఘుమఘుమలాడనున్నాయి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగానే కాకుండా... మృగశిర కార్తె నేపథ్యంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, ఫిష్ బిర్యాని, చేపల పులుసు, చేపల వేపుడు ... ఇలా రకరకాల వంటలతో స్టాల్స్ ను ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు రుచి చూపించనున్నారు. తెలంగాణలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిన కారణంగా ప్రజలలో చేపల ఉత్పత్తులపై అవగాహన పెంచడానికి, సంప్రదాయ చేపల వంటకాలను పరిచయం చేయడానికి ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ జరగనున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ లో ప్రజలు పెద్ద సంఖ్యలో రుచులను ఆస్వాదించాలని కోరుతున్నారు.

ఈ క్రమంలో... వరంగల్ జిల్లాలో 20 స్టాల్స్, హన్మకొండ జిల్లాలో 10 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ లోని సిటీ గ్రౌండ్స్, హన్మకొండలోని నేరెళ్ళ వేణుమాధవ్ ప్రాంగణం, పబ్లిక్ గార్డెన్ లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా... పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఫిష్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్నిజిల్లాల్లోనూ చేపల పండుగ జరగనుంది. ఇక .. ఈ మూడురోజులూ తెలంగాణ ప్రజలకు పండుగేపండుగ.

Related Videos