ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు సమీకరణలు, వ్యూహ ప్రతివ్యూహాలూ మారిపోతున్నాయి. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ ... ఈసారి జరగనున్న ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ విజయం సాధించి.. అధికార పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ పెద్దలు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఇందులోభాగంగా ఈసారి సీఎం కేసీఆర్ ... ఈసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కుమార్తె కవితను అసెంబ్లీకి పంపాలని ఫిక్సయ్యారని సమాచారం. కవిత గతంలో నిజామాబాద్ ఎంపీగా చేశారు.

2018 ఎన్నికల ఫలితాల అనంతరం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కవిత కూడా... ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ఇందులోభాగంగా ఆమె భాగ్యనగరంలోని  గ్రేటర్ పరిధిలో.. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారని సమాచారం. ఎంపీగా గెలిచి... లోక్ సభలో అడుగు పెట్టడం కంటే... ఇక్కడే ఎమ్మెల్యేగా గెలిచి... మంత్రివర్గంలో స్థానం సంపాదించాలన్న ఆకాంక్షతో ఉన్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం ముషీరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేసీఆర్ చేసిన సూచన మేరకు గోపాల్ కూడా ఆ స్థానంలో కవిత పోటీ చేసేందుకు  సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నియోజకవర్గంలో బీజేపీ  బలపడుతుండటం వల్ల ... ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కవిత లాంటి బలమైన అభ్యర్థి పోటీ చేస్తేనే పార్టీ గట్టెక్కుతుందని కేసీఆర్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న ముస్లింల ఓట్లను కవిత అయితే బాగా ఆకర్షించగలదని పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయని సమాచారం.

 పైగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై మళ్లీ పట్టు సాధించాలంటే భాగ్యనగరంలో పార్టీకి బలమైన స్థానిక నాయకత్వం అవసరమని కేసీఆర్ బలంగా నమ్మడం కూడా ఈ నిర్ణయం వెనకున్న మరో కారణం అని తెలుస్తోంది.  గ్రేటర్‌ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కానీ నగర పరిధిలో సీఎం కేసీఆర్‌ కుటుంబం నుంచి ఎలాంటి ప్రాతినిధ్యం లేకపోవడంతో గ్రేటర్‌ రాజకీయాల్లో ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

కుటుంబంలోని ఒకరు గ్రేటర్‌ పరిధిలో ప్రజాప్రతినిధిగా ఉంటే ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో సులభంగా చక్రం తిప్పవచ్చని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా తొలుత మంత్రి కేటీఆర్‌ను కూకట్‌పల్లి లేదా శేరిలింగంపల్లి నుంచి పోటీ చేయించాలని భావించారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ కు అంత అనుకూలంగా లేదని సర్వే ఫలితాల్లో తేలడంతో... ఆ ప్రతిపాదనను వెనక్కు తీసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

ఇందుకు బదులుగా ఎమ్మెల్సీ కవితకు హైదరాబాద్‌ నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తే రాజధానిలో ఆమె ద్వారా రాజకీయ చక్రం తిప్పొచ్చని అధినేత భావిస్తున్నట్లు తెలిసింది. ఇందులోభాగంగానే.. నగర నడిబొడ్డున ఉన్న ముషీరాబాద్‌ నియోజకవర్గం అనుకూలంగా ఉంటుందని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కవిత ముషీరాబాద్‌ నుంచి పోటీ చేయాలనే ఆలోచనకు పలు ప్రత్యేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ఆమె స్థాపించిన తెలంగాణ జాగృతి కార్యాలయం ఇక్కడే ఉండడంతో ... తద్వారా పలు కార్యక్రమాలు నిర్వహించి ఉన్నారు. ఆ సమయంలో నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించారు. వీటి ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకు ఆమె చేరువయ్యారు. అందుకే... ముషీరాబాద్ లో కవితను పోటీ చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో... కేసీఆర్ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయనేది వేచి చూడాలి.

Related Videos