తమిళ్ స్టార్ హీరో అజిత్, త్రిష జంటగా తెరకెక్కిన తమిళ్ సినిమా విడాముయార్చి. తెలుగులో ఈ సినిమాని పట్టుదల పేరుతో రిలీజ్ చేసారు. లైకా నిర్మాణ సంస్థలో సుభాస్కరన్ నిర్మాతగా మగిజ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా కీలక పాత్రలు పోషించారు. పట్టుదల సినిమా తమిళ్, తెలుగులో నేడు ఇవాళ ఫిబ్రవరి 6న రిలీజయింది. ఇక కథ విషయానికొస్తే.. అర్జున్ (అజిత్), కయల్ (త్రిష) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అబెర్బైజాన్ దేశం బాకులో నివాసం ఉంటారు. పెళ్లి అయిన 12 ఏళ్ళ తర్వాత కయల్ డైవర్స్ కావాలని అడిగి అదే దేశంలో వేరే ఊళ్ళో ఉంటున్న వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ అర్జున్ కారులో వెళదాం మన చివరి ట్రిప్ అని బతిమాలుకోవడంతో ఓకే చెప్తుంది. అలా అర్జున్ – కయల్ ఇద్దరు కారులో బయలుదేరుతారు. మధ్యలో కొంతమంది ఆకతాయిలు వీళ్ళను ఇబ్బంది పెడతారు. ఓ పెట్రోల్ బంక్ లో కయల్ కు రక్షిత్ (అర్జున్ సర్జా) – అతని భార్య దీపికా (రెజీనా) పరిచయం అవుతారు. అనుకోకుండా అర్జున్ – కయల్ కారు ఆగిపోవడంతో అదే దారిలో వస్తున్న రక్షిత్ – దీపికాల ట్రక్ లో కయల్ వెళ్లి నెక్స్ట్ వచ్చే ఓ కేఫ్ దగ్గర ఆగి కారు రిపేర్ కి మెకానిక్ ను లేదా ఏదైనా ట్రక్ పంపిస్తాను అని చెప్పి వెళ్తుంది.
అనుకోకుండా కారు స్టార్ట్ అవ్వడంతో అర్జున్ వెళ్తే తన భార్య అక్కడ ఉండదు. తన భార్య ఏమైపోయిందో అని వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో రక్షిత్ ట్రక్ కనిపించి రక్షిత్ ని ప్రశ్నిస్తే అసలు మీరెవరు అని పరిచయం లేనట్టు మాట్లాడతాడు. దీంతో అర్జున్ తన భార్య కయల్ ఏమైందో అని పోలీసుల దగ్గరకు వెళ్తాడు. మరి అర్జున్ భార్య కయల్ ఏమైంది? రక్షిత్ అబద్దం ఎందుకు చెప్పాడు? తన భార్యని అర్జున్ కలిశాడా? అసలు అర్జున్ – కయల్ ఎందుకు విడాకులు తీసుకోవాలనుకున్నారు..రక్షిత్ – దీపికాలు ఎవరు? రోడ్డు మీద అర్జున్ – కయల్ ని ఇబ్బంది పెట్టిన ఆకతాయిలు ఎవరు? వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
ఇక సినిమా విశ్లేషణ విషయానికొస్తే.. సాధారణంగా ఇటీవల అజిత్ సినిమాలు అంటే ఎక్కువ యాక్షన్ ఉంటుంది. అయితే ఈ సినిమాలో యాక్షన్ తక్కువ ఉన్నా ఓ చిన్న పాయింట్ ని పట్టుకొని సినిమా అంతా సాగదీశారు. ఫస్ట్ హాఫ్ అర్జున్ – కయల్ పరిచయం, ప్రేమ, డైవర్స్ చూపించి కారులో ప్రయాణంతో సాగుతుంది. కయల్ మిస్ అయిన తర్వాత ఆమె కోసం వెతకడం, ఇంటర్వెల్ కి ఓ ట్విస్ట్ ఇచ్చినా అది ఊహించేయొచ్చు. ఇంటర్వెల్ తర్వాత రక్షిత్ – దీపికాల కథ, తన భార్య కోసం అర్జున్ చేసే పోరాటమే సాగుతుంది.
సినిమా మొదలయిన దగ్గర్నుంచి కారు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యేవరకు బోరింగ్ గానే సాగుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి కాస్త ఆసక్తిగా మారినా సెకండ్ హాఫ్ లో మళ్ళీ దీపికా – రక్షిత్ ల కథ బోర్ కొట్టిస్తుంది. ఇంటర్వెల్ లో ట్విస్ట్ అని అంతా అనుకున్నది అసలు అది ట్విస్ట్ కాదని తేలిపోవడంతో ఉన్న ఆసక్తి కూడా పోతుంది. ఇక క్లైమాక్స్ రెగ్యులర్ చాలా సినిమాలల్లో చూపించే క్రైమ్ లతోనే ముగించారు. ఫస్ట్ హాఫ్ అంతా సాఫీగా సాగి సెకండ్ హాఫ్ లో మొత్తం యాక్షన్ సీక్వెన్స్ లు చూపించారు. ఇక కథ అంతా అబెర్బైజాన్ దేశంలోనే సాగింది. ఆ కథని ఇక్కడ తీసినా చూడొచ్చు కాకపోతే లొకేషన్స్ కోసం దర్శకుడు ఆ దేశానికే వెళ్లి తీసివుండొచ్చు. సినిమాలో అజిత్ ఫ్యాన్స్ ఆశించే ఎలివేషన్స్ కూడా ఏమీ లేవు. గత కొన్నాళ్లుగా అజిత్ ఏదో టైం పాస్ కి సినిమాలు చేస్తున్నారు తప్ప ఆసక్తిగా చేయట్లేదని అంతా అనుకుంటున్నారు. ఈ సినిమా చూస్తే అలాగే అనిపిస్తుంది.
నటీనట్లు పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే... అజిత్ ఎప్పట్లాగే తన యాక్షన్స్ తో పాటు ఎమోషన్స్ తో ప్రేక్షకులని మెప్పిస్తాడు. త్రిష కాసేపే కనిపించి కొన్ని డైలాగ్స్ తో ఓకే అనిపిస్తుంది. కథలో త్రిష మిస్ అయ్యే పాత్ర కావడంతో ఎక్కువ స్కోప్ లేదు. రెజీనా, అర్జున్ మాత్రం నెగిటివ్ పాత్రల్లో బాగా నటించారు. మిగిలిన నటీనటులు కూడా పర్వాలేదనిపించారు.
అజిత్ అంటేనే యాక్షన్ సీక్వెన్స్ లు కాబట్టి యాక్షన్ సీక్వెన్స్ లు మాత్రం బాగానే డిజైన్ చేసారు. తెలుగు డబ్బింగ్ బాగానే కుదిరింది. నిర్మాణ పరంగా సినిమా వేరే దేశంలో తీసినా చాలా తక్కువే ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. సగం సినిమా ఒకే రోడ్డు మీదే తీసేసారు. దర్శకుడు భార్య – భర్తల ఎమోషన్ ని చెప్పడానికి ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. కానీ ఎమోషన్ సరిగ్గా పండలేదు.
మొత్తానికి అజిత్ ‘పట్టుదల’ సినిమా మిస్ అయిన భార్యని కనిపెట్టడానికి భర్త చేసే పోరాటంతో లవ్ రోడ్ ట్రిప్ యాక్షన్ కథగా సాగుతుంది. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos