వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ 2025లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లి పతక ఆశలు రేకెత్తించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు.. అసలు సిసలు పోరులో చేతులెత్తేసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ సింధు 14-21, 21-13, 16-21 తేడాతో ఇండోనేషియా ప్లేయర్, పుత్రి కుసుమవర్ధని చేతిలో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో 6వ పతకం సాధించాలనుకున్న సింధు ఆశలు ఆవిరయ్యాయి. ఒకవేళ ఈ మ్యాచ్‌లో సింధు విజయం సాధించి ఉంటే.. సెమీ ఫైనల్ చేరి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకునేది.

64 నిమిషాల పాటు సాగిన ఈ క్వార్టర్స్ పోరులో సింధు ఆఖరి వరకు పోరాడినా ఫరాభావం తప్పలేదు. కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమిస్తూ పాయింట్లు సాధించిన 23 ఏళ్ల కుసుమవర్దని.. కెరీర్‌లో తొలి వరల్డ్ ఛాంపియన్‌షిప్ పతకాన్ని ఖాయం చేసుకుంది. తొలి గేమ్ నుంచే కుసమర్ధని సింధుపై ఆధిపత్యం చెలాయించింది. 6-6తో సమంగా ఉన్న దశలో వరుసగా నాలుగు పాయింట్స్ సాధించిన కుసుమవర్థని 10-6తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరి వరకు అదే జోరును కొనసాగించి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో సింధు అద్భుతంగా పుంజుకుంది. నెట్ దగ్గర అద్భుతంగా ఆడి.. స్మాష్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. 4-3 వద్ద విజృంభించి వరుసగా 6 పాయింట్స్ ఖాతాలో వేసుకొని 10-3తో ముందంజలో నిలిచింది.


ఆ తర్వాత మూడు పాయింట్స్ కోల్పోయినా.. వరుసగా 6 పాయింట్స్ సాధించి ఆధిక్యాన్ని 16-6 తో డబుల్ చేసుకుంది. అదే జోరును కొనసాగిస్తూ 21-13తో గేమ్ సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌ హోరాహోరీగా సాగింది. సింధు, కుసుమవర్ధని నువ్వా-నేనా అన్నట్లు తలపడటంతో 9-9తో గేమ్ ఉత్కంఠగా మారింది. ఈ సమయంలో అనవసర తప్పిదాలు చేసిన సింధు వరుసగా పాయింట్స్ కోల్పోయింది. ఒక దశలో సింధు తేరుకొని ఆధిక్యాన్ని 17-16కు తగ్గించినా.. కుసుమవర్దిని అద్భుత ఆటతీరుతో వరుసగా నాలుగు పాయింట్స్ గెలిచి విజయాన్ని అందుకుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జంటకూ చుక్కెదురైంది. క్వార్టర్స్‌లో భారత జోడీ 15-21, 13-21 తేడాతో చెన్ టాంగ్-తో యీ వీ(మలేసియా) జోడీ చేతిలో ఓడింది.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos