మాస్ మహారాజా రవితేజ సినిమా షూటింగ్‌కు మావోయిస్టుల వారోత్సవాలు అడ్డంకిగా మారాయి. ఆంధ్రప్రదేశ్, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రవితేజ సినిమా షూటింగ్‌ను అర్ధాంతరంగా నిలిపివేశారు. మోతుగూడెం, పోల్లూరు, డొంకరాయి, సీలేరు పరిసర ప్రాంతాల్లో దాదాపు 20 రోజుల షెడ్యూల్ కోసం చిత్రబృందం భారీ సెట్స్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ నెల 8వ తేదీ వరకు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) మావోయిస్టులు వారోత్సవాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో..  భద్రతా కారణాల దృష్ట్యా ఈ షూటింగ్‌ను కేవలం ఐదు రోజులకే ప్యాకప్ చేస్తున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఏజెన్సీ ప్రాంతంలో సినిమా షూటింగ్‌లు జరిగితే, స్థానిక యువతకు లైటింగ్,సెట్స్, ఇతర పనుల్లో తాత్కాలికంగా ఉపాధి లభిస్తుంది. నెల రోజుల పాటు మంచి ఆదాయం వస్తుందని ఆశించిన స్థానిక యువతకు షూటింగ్ రద్దుతో తీవ్ర నిరుత్సాహం ఎదురైంది. షూటింగ్ తిరిగి చేస్తారో లేదో అనే దిగులు మన్యంలో ఉన్న యువకులను పట్టుకుంది. ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో పెద్ద నిర్మాతలు ఇక్కడికి రావడానికి వెనుకాడతారేమోనని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కాగా మావోయిస్టుల బంద్ నేపథ్యంలో చింతూరు డివిజన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి ఏజెన్సీ ప్రాంతంలో విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. జాతీయ రహదారి 30 వద్ద నిన్నటి నుండి పోలీసులు తనిఖీలను కట్టుదిట్టం చేశారు. భద్రాచలం వైపు వెళ్లే వాహనాలను సైతం కూనవరం మీదుగా మళ్లిస్తున్నారు. వాహనదారులు ఎవరూ కూడా అర్ధరాత్రి ప్రయాణాలు చేయవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తం మీద, మావోయిస్టుల వారోత్సవాల కారణంగా టాలీవుడ్ ప్రముఖ చిత్రం షూటింగ్ నిలిచిపోవడం ఏజెన్సీ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos